‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశా. డబ్బు ఖర్చు పెట్టా. అయినా నాకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినా సరే కాకర్ల సురేష్‌కు నేను సహకరించను’ బొల్లినేని వెంకటరామారావు ధోరణి ఇది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉన్నాయి. బొల్లినేని, సురేష్ వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. అంతా సర్దుకుంటుందని కేడర్ భావిస్తున్నా.. ఆ పరిస్థితులు కనిపించడం లేదు.
ఇటీవల చంద్రబాబు వింజమూరులొ ప్రజాగళం సభ నిర్వహించారు. ఇందుకు బొల్లినేని డుమ్మా కొట్టారు. పైగా తన మనుషులు వెళ్లకుండా చేశారు. అభ్యర్థి సురేష్ నియోజకవర్గానికి కొత్త కావడంతో జన సమీకరణ చేయడంలో విఫలమయ్యారు. దీంతో జనం లేక సభ వెలవెలబోయింది. ఆ ఊరిలో బాబు బస చేయగా టీడీపీ నేతలు జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రామారావు, సురేష్‌ను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. అయినా వారి మధ్య సయోధ్య కుదరలేదు. గత వారం కాకర్ల అన్ని మండలాల నేతలతో ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. వీటికి రామారావును పిలిచి మాట్లాడి సర్దుకుపోవాలని చెప్పాలనుకున్నారు. అయితే బొల్లినేని రాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో సహకరించనని సంకేతాలు పంపారు.
కొద్దిరోజుల క్రితం కలిగిరి క్యాంపు కార్యాలయంలో తన ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. కాకర్లకు సహకరించే ప్రసక్తి లేదని వారితో చెప్పినట్లు సమాచారం. అతను ఓడిపోయాక తన వారసులకు అవకాశం ఉంటుందని అన్నారని ప్రచారం జరుగుతోంది. బొల్లినేని వ్యవహారశైలితో విసిగిపోయిన కాకర్ల వర్గం ఎదురుదాడికి దిగింది. వింజమూరులో అనుచరులతో జరిగిన సమావేశంలో సురేష్ సోదరుడు సునీల్ ‘ఆ బొల్లినేని దయ మానకు అవసరం లేదు. ఎలా గెలవాలో బాగా తెలుసు. మమ్మల్ని ఎలా ఓడిస్తారో చూస్తామని వ్యాఖ్యానించారు. దీంతో ఇక్కడ అసమ్మతి సెగలు చల్లారే సూచనలు కనిపించడం లేదు. తెలుగు తమ్ముళ్లు పూర్తిగా డీలా పడిపోయారు.