వైయస్ఆర్ సీపీ విజయంపై తాము పూర్తి ధీమాతో ఉన్నట్టు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్ గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వారందరూ వైయస్ఆర్ సీపీకే ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగిందని అంతేకానీ చంద్రబాబును గెలిపించాలన్న ఉద్దేశం సామాన్య ప్రజల్లో ఏ మాత్రం లేదని ఆయన తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. కూటమి కట్టి చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ఓటర్లు తమ పార్టీకే మొగ్గు చూపారనే విశ్వాసం తమకు ఉందన్నారు.
కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని తెల్చేశారు. తొలుత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేసి లబ్దిపొందాలని చూసిన చంద్రబాబు అది ఫలించకపోవడంతోనే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసకు పథక రచన చేశారని, వీరి కుట్రలను ప్రజలందరు గమనిస్తున్నారని చంద్రబాబుకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు. ఈసీ నియమించిన వారు ఉండగా హింస జరగడం అంటే ఈసీ ఫెయిల్యూర్ కిందకే వస్తుందని, ఏ కారణాలను చూపించి అధికారులును మార్చించారో అక్కడే హింస జరగడం అంటే టీడీపీ కుట్రపూరితంగా పథకం ప్రకారం పురంధేశ్వరి బీజేపీ లీడర్ల సాయంతో అందరినీ తప్పించారనేది స్పష్టమవుతోందని, ఈ కుట్రని ప్రజలందరు గమనించారని చెప్పారు.