ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోఅధికార వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీలో చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరారు.
కాగా జనసేన పార్టీలో ముఖ్య నేతగా పేరున్న పోతిన మహేశ్ తో పాటు ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్ కు పవన్ కళ్యాణ్ మొండిచెయ్యి చూపిన సంగతి తెలిసిందే. పార్టీ వీడే క్రమంలో రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేదు, భవిష్యత్తును ఇచ్చేవాళ్లే నాయకులవుతారని పోతిన మహేష్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వైసీపీలో చేరడంతో విజయవాడ వెస్ట్ సీటులో పోటీ చేస్తున్న సుజనా చౌదరి గెలుపు అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
రాయచోటి టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న రమేష్ కుమార్ రెడ్డి కూడా టీడీపీ అధినేతపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికి టీడీపీలో తగిన గుర్తింపు లేదని, డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం 25 ఏళ్లు కష్టపడి పనిచేశానని,తమ బాధలను చెప్పుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ సైతం దొరకని పరిస్థితి టీడీపీలో ఉందని పార్టీ అధినేత తీరును ఎండగట్టారు. తాజాగా ఆయన కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ యాత్రకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతుండడంతో మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ఎన్నికయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.