2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరుపున ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయడానికి నరేంద్ర మోడీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. మొదట ఈనెల 3,4 తేదీలలో పర్యటన ఉంటుందని షెడ్యూల్ విడుదల చేశారు. దానిని తర్వాత 7,8 తేదీలకు మార్పు చేస్తూ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి తేదీలు మారుస్తూ 6,8 తేదీలలో పర్యటన ఉంటుందని షెడ్యూల్ విడుదల చేశారు. కూటమి పొత్తు ఖరారైన తర్వాత నరేంద్ర మోడీ ఒకసారి మాత్రమే రాష్ట్రానికి రావడం గమనార్హం.
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పార్టీల తరఫున ప్రచారం కోసం ప్రధాని మోడీ మే 6వ తేదీన ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకుని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరి మద్దతుగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి అనకాపల్లి వెళ్లి అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ మద్దతుగా బహిరంగ సభలో పాల్గొంటారు. అనకాపల్లి బహిరంగసభ తర్వాత ఆ రాత్రికి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోనున్నారు.
మోడి తిరిగి మే8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి వస్తారు. అక్కడి నుంచి పీలేరు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి విజయవాడకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ రోడ్ షో లో పాల్గొని రాత్రికి ఢిల్లీ వెళ్లిపోతారు.