పెన్షన్ ఇంటికి వచ్చి అందకపోవడానికి కారణాలు ఏమిటి అని ప్రజలందరికీ అర్థం అవుతున్నాయి.. ఎల్లో మీడియా ఎంత విష ప్రచారం చేసినా, ప్రజల నుండి సంక్షేమాన్ని లాక్కోవాలి అని ఎంత ప్రయత్నించినా అది అయ్యేలా కనిపించడం లేదు…
“ఆ చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి పెన్షన్లను ఇట్టా చేసారేంటన్నా. వారం రోజులు పట్టింది అందరికీ పెన్షన్లు అందడానికి. ముసలివాళ్లను మంచాల మీద మోసుకెళ్తూ, నీళ్లు, తిండి లేక ఎండల్లో పడి ఎదురు చూడాల్సి వచ్చింది. చంద్రబాబు, నిమ్మగడ్డా కలిసి చేసిన ఈ పని దారుణం. మా పింఛన్లు మాకు సరిగ్గా అందకుండా చేసిన వాళ్లకి మా ఉసురు తగులుతుంది. ఆ రాధాకృష్ణకు, రామోజీరావుకి ఖచ్చితంగా తగులుతుంది. జగనన్నా నీవల్లే నా ఇంటికి 85 వేలు వస్తున్నాయి. నాన్నగారి టైమ్ లో నాకు గుండె ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు అయితే మా సచివాలయం పరిధి నుండి డాక్టర్లు ఇంటికే వచ్చి సకాలంలో మందులు కూడా ఇచ్చిపోతున్నారు. మీ మేలు మర్చిపోలేను. నువ్వే మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నా.”
“నాన్నా మీరు మా గుండెల్లో నిలిచిపోతారు. నిన్ను గెలిపించుకోవడానికి నీవెంట మేము సిద్ధంగా ఉన్నాం. నాన్నగారు చనిపోయినప్పుడు బసిరెడ్డిపల్లె నుండి మిమ్మల్ని తీసుకువెళ్లి మా ఊళ్లో వైఎస్సార్ విగ్రహం పెట్టించాం. సచివాలయం అనే వ్యవస్థ తెచ్చి ఎంతో మంచి పనిచేసారు. నా 40 ఏళ్ల జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. వయసు చిన్నదైనా పనులు బాగా చేసావయ్యా. స్కూల్ కానీ, పిల్లల భోజనాలు కానీ నెంబర్ వన్ గా చేసావ్. నేను ఉంటానో పోతానో తెలీదు, ఇప్పుడు నీతో ఒక ఫోట్ కావాలి. ఎప్పుడో చామంతి పూడిలో దిగాను…ఇప్పుడు మరోసారి ఫొటో దిగాలి.” ఇదో అనుభవజ్ఞురాలైన వృద్ధురాలి మనోగతం.
” కాలు విరగడంతో ఆపరేషన్లు జరిగాయి నాకు. నాకురాని పథకాలు లేవు. అన్ని పథకాలు కలిపి 3లక్షల 40 వేలు నాకు అందాయి. నీ మేలు ఎప్పుడూ మరవలేం. కానీ చంద్రబాబు చేసిన పనికి చాలా కష్టం అయింది. నాకు ఆయాసం ఉంది. మూడుసార్లు కూర్చుని లేచి సచివాలయానికి వెళ్లాను. నాకు సాయం ఎవరూ లేకపోతే తోడు కోసం ఓ పాపను తీసుకువెళ్లాను. ఆ పాప రాయిని తగులుకుని కిందపడి ముక్కుకు గాయం చేసుకుంది. మమ్మల్ని ఇంతకష్టపడేలా చేసింది చంద్రబాబే. రైతుభరోసా సహా నాకు ఎన్నో పథకాలు అందాయి. మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. నీ వల్లే నేను ధైర్యంగా బతుకుతున్నా” కుర్చేటి మండలం అగ్రహారానికి చెందిన కర్నాటి సుబ్బులు అనే పెద్దాయన ఆవేదన.
“జగనన్నా….నా చిన్నప్పుడే భర్త వదిలేసాడు. చాలా బాధలు పడ్డాను. ఒంటిరి మహిళ పెన్షన్ వస్తోంది నాకు. నా కూతురు డిగ్రీ చదువుతోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నువ్వు వేసే డబ్బులతోనే నా పిల్లలను చదివించుకుంటున్నా. ఈజన్మలో నీ సాయం మరువలేను. మేమెప్పుడూ నీకు రుణపడి ఉంటాం. నువ్వే నా పెద్దన్నవి.”
శివాజీనగరం వార్డు , దర్శి, కి చెందిన వితంతు పెన్షన్ లబ్దిదారు మనోగతం ఇది…
“నా పెనిమిటి మరణించి 15 సంవత్సరాలు అయింది. నాకు ఇల్లూ వాకిలీ లేదు. ఇప్పుడు ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. ఇప్పటి వరకూ నేను 1లక్షా 30వేలు లబ్ది పొందాను. ఈనెల పెన్షన్ వాలంటీర్ ఇవ్వలేదు. నాకొడుకును అడిగితే దర్శి వెళ్లి తెచ్చుకోవాలన్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేను. ఎవరినో బతిమాలి వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నాను. జగనన్నా మళ్లీ నువ్వే రావాలి. 175కి 175 రావాలి. నువ్వే ముఖ్యమంత్రివి కావాలి. నీ నీడన మేం ఉండాలి. మంచి మనసున్న మారాజు నువ్వు. మా సొంత కొడుకులు కోడళ్లు ఎవ్వరూ పెట్టరు. పదెకరాల ఆస్తి ఇచ్చినా మనని చూడరు. ఎక్కడా ఉంచరు. కానీ అందరినీ చూసే మంచి మనసున్న మనిషి ఎవరికి పుడతారు. దైవబలంతో ఆ తల్లికి పుట్టాడు. అలాంటి మన జగనన్ను గెలిపించుకోవాలి” ఓ వితంతు కోరిక ఇది.
” ప్రతినెలా ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెట్టి పోతుంటే ఈ నెలలో మమ్మల్ని మూడుచోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళ్లాను ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు ఇంకోచోటకు వెళ్లాను అక్కడా కాదన్నారు. మోకాళ్లనొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో. చివర్లో ఒకచోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో అంటే అక్కడికి వెళ్లి తెచ్చుకున్నాను. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ చంద్రబాబు మమ్మల్ని మంచికి అయితే కాదు. మాకు వాలంటీర్లు కావాలి, వాలంటీర్ల వ్యవస్థ కావాలి. మేము చూడటానికి మనుషులం బాగున్నా మోకాళ్లనొప్పితో నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు , మాకు వాలంటీర్లు కావాలి. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు, గడపగడపకు పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాస్కులతో సహా గడపగడపకు పంపించారు. వాలంటీర్ల వ్యవస్థను మాత్రం తీసేస్తే మాత్రం మేము ఒప్పుకోము.” – దర్శికి చెందిన ప్రభావతి..
” నేను 2019కి ముందు ఉన్న చిన్నమాట చెబుతాను. అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీ అని ఒకటి ఉండేది. వాళ్లు డబ్బు రూపంలో గానీ, లేదనుకో వాళ్ల మనుషులయితే అయితే పనిచేసేవాళ్లు, పెన్షన్లు ఇచ్చేవారు. మీరు పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఇవ్వని ఒకటి ఏంటంటే దేవుని దూతగా వాలంటీర్ ను పంపించడం. ఈ వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి మీ రూపంలో దివ్యాంగులకు ఏం కావాలి, దివ్యాంగులకు ఎటువంటి హెల్ప్ కావాలి అని పెన్షన్ ఒక్కటే కాదు సదరం సర్టిఫికెట్ అయినాసరే, ఆధార్ కార్డు అయినాసరే ప్రతిఒక్కటీ వచ్చి మేము కాళ్లు బయటపెట్టకుండా చూసుకునేవారు. కానీ చంద్రబాబు మిమ్మల్ని ఏం చేయాలేక తన అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టికొట్టుకుపోతారు. నేను కళ్లారా చూశాను ఓ 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కు వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోయింది దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డా.. చంద్రబాబా అందరూ ఆలోచన చేయాలి.” నరసింగరావు అనే ఓ వికలాంగుడు.
” రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్ కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలు ఉండేవి. ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చినోళ్లకు కుర్చీలుండవు. అప్పుడు దోమలు మరీ కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుంది అని నేను వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వాడ్ని. 8 గంటలకు వచ్చేవారు అన్ని పనిచేసేసరికి 9 అయ్యేది. అప్పటికే దాదాపు వంద, రెండొందల, మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లకు మీరు సాయంత్రం గానీ, రేపు గానీ రండి అని చెప్పేవారు. అలా 7 రోజులదాకా పెన్షన్ ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ మోహన్ రెడ్డి బంగారపు మెదడు లోనుంచి వచ్చిన మేధావి ఆలోచన. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వీళ్లద్దరికీ మే 13న ప్రజాకోర్టులో శిక్ష వేస్తుంది, జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది.” ఓ వికలాంగుడు బాబుకు ఇచ్చిన శాపం.
నువ్వే రావాలి మాకు. నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాన్న హయాంలో మా ఇంట్లోకి నీళ్లుపోతే నాకు ఇళ్లు కట్టించాడు వైయస్. ఎన్ని సంవత్సరాలు అయినాసరే నువ్వేకావాలి. నాకు నలుగురు కొడుకులున్నా లాభం లేదు, నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు నా కొడుకువి. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది బ్యాంకుల నుంచి రూ.23 వేలు నీ సొమ్ము వచ్చాయి నేను తింటున్నాను. నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా” … గంగిరెడ్డి మంగమ్మ అనే ఓ వృద్ధురాలి వాంఛ.
ఇలా అన్ని వర్గాల నుండి సీఎం జగన్ కు ఆశేష నీరాజనం అందుతుంది. జగన్ అనే వ్యక్తి మరలా ముఖ్యమంత్రి అవ్వకపోతే తమ బతుకులు ఛిద్రం అవుతాయనే ఆందోళనతో వారే జగన్ మోహన్ రెడ్డి కి స్టార్ క్యాంపెయినర్ ల లా మారి ఆయనను గెలిపించుకునే బాధ్యత తమ భుజాలకు ఎక్కించుకున్నారు.. అందుకేనెమో జగన్ సామాన్య ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించింది…