పరిటాల సునీతకు తన కంచుకోట లాంటి రాప్తాడులో ఆదరణ కరువైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తన వెంట నడిచే నాయకులు, జెండా పట్టుకుని తిరిగే కార్యకర్తలు లేక అల్లాడిపోతున్న సునీత టీడీపీ వారికే మళ్ళీ టీడీపీ కండువాలు కప్పుతూ అభాసు పాలవతుండడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో తిరుగుతున్న సునీత తనకు కనపడిన ప్రతి మనిషికి అప్పటికప్పుడు టీడీపీ జెండా మెడలో వేస్తూ ఫొటోలు తీసి టీడీపీలో జాయిన్ అవుతున్నారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమాలను చూసి రాప్తాడు ప్రజలు నవ్విపోతున్నారు. ప్రజలేమో ఆ జెండాలు వారి ముందే తీసి బయట పడేస్తూ టీడీపీ వారిని ఇంకొకసారి ప్రచారానికి రావద్దని తెగేసి చెప్తున్నారు. ఈ మధ్యనే ఆత్మకూరు మండలంలో పరిటాల సునీత తమ్ముడు బాలాజీ ఒక వ్యక్తికి మెడలో టీడీపీ కండువా కప్పాడు అయితే ఆ వ్యక్తి టీడీపీ జెండాకు చెప్పులు చెపిస్తూ తగలబెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది రాప్తాడు నియోజకవర్గ గ్రూపుల్లో వైరల్ గా మారి టీడీపీ పరువు పోగొట్టింది.
ఇంతటితో ఆగకుండా తమ సొంత పార్టీ నాయకులను పిలిచి అధికారంలోకి రాగానే మీకు పదవులు ఇస్తామనో లేకుంటే ఆర్ధిక లబ్ధి కలిగే పనులు ఇస్తామని సొంత పార్టీ నేతలనే మభ్య పెడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా వివిధ కుల సంఘాలకు నోటికి వచ్చిన హామీలనిస్తూ, ప్రతి కులానికి వర్గాలుగా విడదీసి డబ్బులు పంచుతూ వారి మధ్య గొడవలకు ఆజ్యం పోస్తున్నారు. కొంత మందిని మాట్లాడాలని ఇంటికి పిలిపించుకొని బలవంతంగా టీడీపీ కండువాలు కప్పుతుంటే వారు బయటకు వచ్చి పరిటాల సునీత ఇంటి బయటే టీడీపీ కండువాలను విసిరేస్తూ వెళ్లిపోతున్నారు. కాగా ఈ పరిటాల సునీత ఎదుర్కొంటున్న వ్యతిరేకతను గమనిస్తున్న స్థానికులు, రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికల తరువాత పరిటాల కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.