ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై మూడు రోజులై, నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగుతున్న ఇంకా టీడీపీలో సీట్ల పంచాయతీ తేల లేదు. మరో మూడు రోజులు ఉంటే నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుంది అయిన కూటమి నేతలు అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్దుల మార్పు పైన ఆ పార్టీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా అభ్యర్దుల మార్పు పైన జరుగుతున్న చర్చకు క్లారిటీ ఇచ్చారు. అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్దులను మార్చుతూ నిర్ణయించారు. మరో మూడు నియోజకవర్గాల్లోనూ మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చారు.
ఉండి సీటు రఘురామ కృష్ణం రాజుకు ఖరారు చేశారు. రఘురామకు ఖరారు చేయడంతో రామరాజు వర్గం తీవ్ర ఆందోళనలో ఉంది. ఉండి నుంచి రామరాజునే కొనసాగించాలని అక్కడ ఆయన మద్దతు దారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో, రామరాజు నిర్ణయం ఏంటనేది కీలకంగామారుతోంది. అదే విధంగా మాడుగుల అభ్యర్దిని మార్పు చేసారు. అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పేరు ఖరారు చేసారు. పాడేరులో గిడ్డి ఈశ్వరికి సీటు దక్కింది. అక్కడ తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగేందుకు గిడ్డి ఈశ్వరి సిద్దం అవ్వడంతో ఆ సీట్ ఆమెకే ఖరారు చేశారు. మడకశిర స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజు బరిలోకి దిగనున్నారు. వెంకటగిరి స్థానాన్ని తొలుత కురుగొండ రామకృష్ణ కుమార్తెకు సీటు ప్రకటించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు తిరిగి సీటును కురుగొండ రామకృష్ణకు కేటాయించారు.
అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్ది పోటీలో ఉన్నారు. అయితే బీజేపీ తమ సీటు వదులుకోవటానికి సిద్దంగా లేదు. దీంతో నల్లమిల్లి రామకృష్ణరెడ్డి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రామకృష్ణ రెడ్డి బీజేపీలో చేరుతారు అనే సంకేతాలు ఇప్పటికే పలు మీడియాలు వేదికగా వార్తలు వస్తున్నాయి. ఈ సీటు పైన ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.అనపర్తి వ్యవహరంపై క్లారిటీ వచ్చాక దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చే అవకాశం ఉంది.