నేడు ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ ఆసరా నాలుగో విడత మొత్తాన్ని పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డితో పాటు పలువురు లబ్ధిదారులు మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే
నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే – వై. విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పుకు చంద్రబాబు నాకు సంబంధం లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ గారు మాత్రం రూ. 25 వేల కోట్లకు పైగా ఇవ్వడం చరిత్ర. రాష్ట్రంలో జగన్ గారి ప్రభంజనం వీస్తూ ఉంది. మహిళలు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో కుటుంబాలను, రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారు. ఇది సీఎంగారి నిబద్దత. కానీ ప్రతిపక్ష నాయకులు పగటిని చూడలేరు, చీకటిని మాత్రమే చూడగలరు, వారికి కళ్ళు కనిపించడం లేదు. రాష్ట్రంలో అర్హత ఉంటే చాలు పథకం అందని వారున్నారా? ఇది కాదా ప్రజాస్వామ్యం. మన ప్రభుత్వంలో అలా ఎప్పుడూ జరగలేదు, పచ్చకండువా వేసుకున్నా ఎర్రకండువా వేసుకున్నా అర్హత ఉంటే చాలు పథకాలు అందించాం. సీఎం సార్ నాలుగున్నరేళ్ళుగా మా ప్రాంతం సుభిక్షంగా ఉంది, మీరు రైతులకు చాలా సాయం చేస్తున్నారు, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. సీఎంగారు ఇక్కడ 75 వేల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ స్ధానిక సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నానని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు పొదుపు సంఘాల మహిళలను మోసం చేసాడు – మమత, లబ్ధిదారు, వజ్రకరూరు, అనంతపురం జిల్లా
అన్నా ఈ వైఎస్సార్ ఆసరా మాకు చాలా సాయం చేసింది. మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మాకు సాయం చేశారు. నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. నేను ఈ వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు రూ. 30 వేల లబ్ధిపొందాను, ఈ డబ్బుతో చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. గతంలో మా పొదుపు సంఘాలు అప్పులు కట్టలేక అన్నీ నిలిచిపోయాయి. కానీ ఈ రోజు ఏ బ్యాంకు ఐనా వెంటనే పిలిచి మరీ లోన్లు ఇస్తున్నాయి. దానికి కారణం మీరే, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అందాయి, నా పెద్ద కొడుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివాడు. విద్యా దీవెన, వసతి దీవెన వచ్చాయి, నా పెద్ద కొడుక్కి మూడేళ్ళు రూ. 60 వేలు, నా చిన్న కొడుక్కి మూడేళ్ళు రూ. 1.20 లక్షలు వచ్చాయి, మొత్తం రూ. 1.80 లక్షలు మీరు ఇచ్చారు. మీ వల్లే నేను ఈ రోజు పిల్లలను చదివించాను, నేను ఇలా సంతోషంగా ఉన్నానంటే కారణం మీరే. నాకు చిరకాల కోరిక సొంత ఇల్లు, నేను అద్దె ఇంటిలో చాలా ఇబ్బందులు పడ్డాను, మీరు నాకు ఇంటి స్ధలం ఇచ్చారు. మా సంఘానికి రూ. 10 లక్షల లోన్ వస్తే నేను రూ. 1 లక్ష తీసుకుని లేడీస్ కార్నర్ నడుపుతున్నాను. నా పెద్ద కుమారుడు ఎంబీఏ చదువుతున్నాడు, గతంలో ఒక పెద్ద మనిషి మీరు రుణాలు కట్టద్దని మమ్మల్ని మోసం చేశాడు, మీరు మాత్రం మమ్మల్ని రుణ విముక్తులను చేశారు, మీకు ఏం చేసినా తక్కువే అన్నా, మీకు రుణపడి ఉంటామని అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చెందిన మమత వెల్లడించారు.