ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని చెప్పారు. 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని వివరించారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇస్తున్న హామీల అమలుకు అయ్యే ఖర్చు వివరాలను వివరించారు.
2019-24 వరకు అయిదేళ్ల కాలంలో ఇచ్చిన హామీల అమలులో ఏనాడు కారణాలు చెప్పలేదని జగన్ చెప్పారు. కరోనా, ఆర్దిక కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయలేదన్నారు. 2.70 లక్షల కోట్లు పథకాల కోసం ఖర్చు చేసామని వెల్లడించారు. హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేసారని జగన్ వ్యాఖ్యానించారు. 2014-19 కాలంలో 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగా..తన హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ చెప్పుకొచ్చారు, 2014-19 వరకు మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు అన్నింటికి కలిపి దాదాపు రూ 70 వేల కోట్లు ఖర్చు అయ్యేదని వివరించారు. చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ ఏడాదికి 1 లక్ష 21 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఇది ఏ రకంగా సాధ్యమని వివరించారు. ఖచ్చితంగా అమలు చేయాల్సిన వాటితో కలిపితే చంద్రబాబు పథకాల ఖర్చు కోసం 1,50,178 కోట్లు అవసరమని జగన్ విశ్లేషించారు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్మెంట్, గోరుముద్ద, ఈ పథకాలన్నీ ఎవరూ ఆపలేరన్నారు.