టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు టీడీపీకి పార్టీకి దూరం కానున్నారా? టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన దేవినేని ఉమను సామాజిక పరిణామాల రీత్యా పక్కన పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారా? కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన దేవినేని ఉమకు మైలవరం నియోజకవర్గంలోనే టికెట్ దక్కని పరిస్థితి నెలకొందా? అంటే అవుననే సమాధానం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీ సీనియర్ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన దేవినేని ఉమకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. వరుసగా నాలుగుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమకు ప్రస్తుతం టీడీపీలోనే టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. మొదటిసారిగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చేతిలో పరాజయం పాలైన తర్వాత దేవినేని ప్రాభవం కృష్ణా జిల్లా రాజకీయాలతో పాటు టీడీపీలో తగ్గుతూ వచ్చింది. మైలవరం నియోజకవర్గంలో తనపై విజయం సాధించిన వసంత కృష్ణ ప్రసాద్ పై మొదటినుండి ఆరోపణలు చేస్తూ వస్తున్న దేవినేని ఉమకు ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ వల్లనే టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వసంత కృష్ణ ప్రసాద్ కి మైలవరంలో టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా చంద్రబాబు టికెట్ హామీ ఇచ్చిన తరువాతనే టీడీపీలో చేరేందుకు వసంత కృష్ణ ప్రసాద్ రెడీ అయినట్లు సమాచారం. వసంత కృష్ణ ప్రసాద్ రాకను మొదటినుండి వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమకు మైలవరం టికెట్ కేటాయింపు విషయంలో అన్యాయం జరుగుతుందనే సందేహాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుండి అన్నారావుపేట నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు దేవినేని ఉమ ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించవద్దని చంద్రబాబు వారించినట్లు సమాచారం. దాంతో తనకు టికెట్ దక్కదనే భావనలో దేవినేని ఉమా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో దేవినేని ఉమ ఉన్నట్లు తెలుస్తుంది.. సందట్లో సడేమియాలా మైలవరం టికెట్ ని బొమ్మసాని సుబ్బారావు కూడా ఆశిస్తున్నారు. పైగా మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ పై టీడీపీ సర్వేలు కూడా చేయిస్తుంది.
కాగా వీరిలో ఒకరికి పెనమలూరు టికెట్ ని కేటాయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటినుండి వసంత కృష్ణ ప్రసాద్ ను వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమ మైలవరం నియోజకవర్గం కాకుండా వేరే చోట నుండి పోటీకి అంగీకరించే అవకాశం లేదని సమాచారం. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఒకవేళ టీడీపీకి గుడ్ బై చెబితే ఏదైన పార్టీలో చేరుతారా లేక స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తారా అనే సందేహాలు సామాన్య ప్రజల్లో నెలకొన్నాయి. ఏది ఏమైనా దేవినేని ఉమా తిరుగుబాటు చేస్తే టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయం అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి..