ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రచారంలో పాల్గొంటున్నాయి. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. 11వ రోజు బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్ జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
ఈరోజు అవ్వాతాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య, మీ ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య మీ బిడ్డగా, మీ మనవడిగా మీ అందరితోపాటు మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఒకసారి మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు పెన్షన్ మనకు ఎంత వస్తుండేది, ఎంత మందికి వస్తుండేది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే.. ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు అప్పట్లో అవ్వాతాతలకు గానీ, వికలాంగులకు గానీ, వితంతు అక్కచెల్లెమ్మలకుగానీ ఇటువంటి అభాగ్యులకు, ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్న వారికి ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు గతంలో పెన్షన్ రూ.1000. అవునా? కాదా?
ఎన్నికలకు 6 నెలలు ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంత మందికి ఇచ్చేవారో తెలుసా? కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెబుతున్నా. అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం రూ.400 కోట్లు ఖర్చయ్యే ఆరోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వీళ్లెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని, వీళ్ల ఆత్మగౌరవం నిలబడాలని, పెన్షన్ల కోసం వీళ్లు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పని ఉండకూడదని, పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదని, లైన్లలో నిలబడి తీరా లైన్లో నిలబడిన తర్వాత, ఎక్కడికెక్కడో ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత, ఈరోజు లేదు రేపు రా.. అని మళ్లీ చెప్పే పరిస్థితి రాకూడదని, మొట్ట మొదట సారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు. అవ్వాతాతల గురించి ఆలోచన చేశాడు. వారి ఆత్మగౌరవం గురించి, వారి కష్టం గురించి ఆలోచన చేశాడు.
అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్న దానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, దానికి అనుసంధానంగా ప్రతి 50 ఇళ్లకు, ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించడం, గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికీ, ప్రతి అవ్వా, ప్రతి తాత ముఖంలో చిరునవ్వు చూడటానికి ప్రతి ఇంటికీ నెల 1వ తారీఖునే అది సెలవుదినమైనా, ఆదివారమైనా ఇంకొకటైనా ఇంకొకటైనా కూడా ఈ 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికీ నెల 1వ తారీఖునే వచ్చి తలుపుత ట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వనూ, ప్రతి తాతనూ వాలంటీర్లు ఒక మనవడిగా, మనవరాలిగా పలకరిస్తూ అవ్వాతాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా పెన్షన్ చేతుల్లోనే పెడుతున్న పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతోంది.
మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు ఆ అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ అప్పట్లో కేవలం రూ.1000 మాత్రమే ఉంటే, అది కూడా కేవలం అరకొరగానే కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంటే, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునో, లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకుని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్లు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా చివరకు ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా, ప్రతి ఒక్కరినీ కూడా నా అవ్వ, నా తాత అని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
ఇవాళ 66.34 లక్షల మందికి పెన్షన్లు.
అందుకే గతంలో 39 లక్షలు మాత్రమే ఉన్న పెన్షన్ దారులు ఈరోజు చూస్తే 66.34 లక్షల మందికి ఈరోజు పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1000 ఇస్తున్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు.. ఈరోజు ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతోంది. తేడాను ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే అవ్వాతాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాలి. ఆ అవ్వల మీద, ఆ తాతల మీద అభాగ్యుల మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త కొత్త రకమైన ఆలోచనలు, మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి.
ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే.. రాబోయే రోజుల్లో మీరంతా కూడా చూస్తున్నారు. ఏ మాదిరిగా జరుగుతున్నాయి రాజకీయాలు అనేది మీరంతా చూస్తున్నారు. అసలు రాజకీయాలు అన్నవి నిజంగా పాతాళానికి వెళ్లిపోయాయి. విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్ట మొదటి సారిగా అడుగులు వేగంగా వేశాడు. ఇంతకు ముందు ఎప్పుడైనా, ఎవరైనా మేనిఫెస్టో అనేది ఇచ్చేవారు. ఆ మేనిఫెస్టో చూస్తే… అబ్బో రంగు రంగులుగా కనిపిస్తోంది. అవ్వలకు ఇది చెప్పేస్తున్నారు, తాతలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు ఇవి చెప్పేస్తున్నారని రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేవి. రకరకాలుగా సామాజికవర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేవి.
ఈరోజు జనాభా ప్రకారంగా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రం మనది. జనాభా ప్రకారం చూస్తే ఇలా 66.34 లక్షల మందికి పెన్షన్ అందుకుంటున్న, జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా పెన్షన్ అమౌంట్ ఇస్తున్న రాష్ట్రం మనదే. రెండోది ఏమిటి అంటే రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు.. దేశంలోనే ఎక్కడా లేదు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్లు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తున్న పరిస్థితి. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్న పరిస్థితి ఉంది.
ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వంవచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకొంటే ఏకంగా రూ.90 వేల కోట్లు ఈ పెన్షన్ రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఒక్కసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి రూ.24 వేల కోట్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత గమనిస్తే బిహార్ లో చూస్తే రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్ లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది రూ.5160 కోట్లు, కర్ణాటకలో చూస్తే రూ.4700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా రూ.8180 కోట్లు. అంతే. ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తున్న డబ్బు ఏకంగా రూ.24 వేల కోట్లు ఇస్తున్నాం.
ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే రేప్పొద్దున మోసం చేసేందుకు రూ.4 వేలంటారు, రూ.5 వేలంటారు, రూ.6 వేలంటారు, ఇంకా అవసరం అయితే మోసం చేసేందుకు ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు కూడా అంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే, మంచి చేసే మనసు ఎవడికైనా ఉంది అంటే నేను ఈరోజు నేను గర్వంగా కూడా ఒకమాట అయితే మీ అందరికీ ఇస్తున్నాను. మేనిఫెస్టోలో నేను చెప్పినా, చెప్పకపోయినా, ఎందుకంటే చేయగలిగిందే నేను చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాకూడదు, చెప్పకూడదు. చేయగలిగిందే చెప్పాలి.
కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ 58 నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా. నేను చెప్పనివి చాలా చేసినవి అన్నీ మీ అందరికీ కనిపిస్తాయి. మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తున్నాను. ఏదైనా, ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఇటువంటి ఏ సెక్షన్స్ కు అయినా కూడా మంచి చేసే విషయంలో జగన్ తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని మాత్రం చెబుతున్నాను.
వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు. అవ్వాతాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశం, పరిస్థితి అసలు ఉండనే ఉండదు అని కూడా చెబుతున్నా. ఈ విషయాలన్నీ మీ అందరికీ ఎందుకు చెబుతున్నానంటే 2014లో ఏం జరిగింది అన్నది మీ అందరికీ కూడా తెలిసే ఉండాలి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 2014లో మీకు గుర్తుండే ఉంటుంది. నా సిద్ధం సభలు చూస్తున్నారా టీవీల్లో అయినా చూస్తున్నారా మీరంతా నా సిద్ధం సభల్లో నేను చెప్పే మాటలు అన్నీ కూడా. చూసే వాళ్లందరూ ఒక్కసారి చేతులు పైకెత్తండి. చూసే వాళ్లు మాత్రమే.
అందరూ చూస్తున్నారు కాబట్టి నేను మళ్లీ చెప్పడం రిపిటేషన్ అవుతుంది. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు ఏమి హామీలిచ్చాడు అని నేను ఇలా ఆయన పోస్టర్ చూపించి, ఆయన స్వయంగా సంతకం పెట్టి, ఆయన ఫొటో, మోడీ గారి ఫొటో, దత్తపుత్రుడి ఫొటోతో 2014లో ఆయన ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడు అని ఇలా మనం ఫొటోలు చూపించి ఆ తర్వాత ఆయన చెప్పిన హామీలు, ముఖ్యమైన హామీలంటూ 2014లో ఏరకంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికీ ఆ పాంప్లెట్ పంపించాడు. టీవీల్లో అప్పట్లో ఈనాడులో, ఆంధ్రజ్యోతి, టీవీ5లో ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంప్లెట్ లో రాసినవి, ముఖ్యమైన హామీలంటూ తాను చెప్పిన విషయాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన అమలు చేయని పరిస్థితులు అన్నీ కూడా మీ అందరికీ సిద్ధం సభల్లో ఆ పోస్టర్ చూపించి చెప్పడం జరిగింది.
ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెబుతున్నాను. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండి. ఎందుకంటే మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఈ మాదిరిగా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే ఎక్కడా కూడా కరప్షన్, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తీసుకొచ్చాడు కాబట్టే ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి రూ.70 వేల కోట్లు మంచి చేస్తూ ఈరోజు పనులు జరుగుతున్నాయి.
కానీ ఈరోజు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకొంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను కరప్షన్, వివక్ష లేకుండా రూ.70వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి జగన్ కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటివి అబద్ధాలే కదా అని రూ.1.40 లక్షల కోట్లు గురించి చెబుతున్నాడంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
కచ్చితంగా నేను మరొక్కసారి మీ అందరికీ మాట చెబుతున్నాను. మనం మొట్ట మొదటి సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున.. వాలంటీర్ వ్యవస్థను మళ్లీ పూర్తిగా మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్ట మొదటి సంతకం చేస్తానని ఈ సందర్భంగా మరొక్కసారి చెబుతూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మరొక్కసారి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటూ సెలవు తీసుకుంటున్నానని మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అని సీఎంవైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.