ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికల గురించి తిరుపతిలో ‘ఇండియా టుడే’ నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి(జగన్) పాల్గొన్నారు. కార్యక్రమ వ్యాఖ్యాత రాజ్ దీప్ సర్దేశాయ్(రాజ్ దీప్) అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలుగా 2019 లో తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి – ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కల్పన, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో మొదలుపెట్టి అంతర్జాతీయ సిలబస్ ప్రవేశ పెట్టడం వరకు ప్రభుత్వ యంత్రాంగం అంచెలంచెలుగా ఎలా పురోగతి సాధించిందో జగన్ చాలా స్పష్టంగా వివరించారు.
ఇదే కార్యక్రమంలో రాజ్ దీప్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, రాబోతున్న ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికీ జగన్ సమాధానమిచ్చారు – వాటి నుంచి రెండు …
రాజ్ దీప్ : కాంగ్రెస్ పార్టీ మీ చెల్లెలు షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలిగా నియమించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది – తద్వారా కాంగ్రెస్ పార్టీ వారు, రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో మీ వెంట ఉన్న వారిలో కొందరిని వారి వైపు తిప్పుకునేందుకు మీ కుటుంబం నుంచే మరొకరిని తెర మీదకు తీసుకొచ్చారనుకోవచ్చా ? ఈ ఎన్నికల్లో మీ సొంత చెల్లెల్ని కూడా మీరు రాజకీయ ప్రత్యర్థిగా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడటం గురించి మీరేమనుకుంటున్నారు ?
జగన్: కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టింది – మన రాష్ట్రం విషయంలో కానీ, మా కుటుంబం విషయంలో కానీ విభజించి పాలించు అనే సూత్రాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ విషయంలో అనైతిక రాజకీయాలకు పాల్పడటం వారికి పరిపాటి అయిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితిలో ఉండడానికి ఇలాంటి దిగజారుడు రాజకీయాలే కారణమని వారు ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి రాజకీయాలు వారికి కొత్త కాదు – గతంలో నేను కాంగ్రెస్ పార్టీతో విభేదించి, నా సొంత పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే, మాకు వ్యతిరేకంగా మా కుటుంబం నుంచి మా చిన్నాన్ననే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మా కుటుంబం నుంచి నా చెల్లెల్నే నా మీదకు ప్రయోగిస్తున్నారు. ఎవ్వరూ అర్ధం చేసుకోలేకపోతున్న విషయమేంటంటే – అన్నిటికంటే బలమైన శక్తి ఒకటుంది – అదే దేవుడు – కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకేదైనా పార్టీ కానీ … ఇలాంటి వారందరికీ అంతిమంగా ఆ దేవుడే గుణపాఠం చెబుతాడని నమ్ముతున్నాను.
రాజ్ దీప్: ఈ రోజు ఇక్కడున్న వారందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా – మేము లోపలకు వస్తుండగా బయట ఒక అమ్మాయి తన చేతిలో ఉన్న ట్యాబ్ ని జగన్ కి చూపిస్తూ ‘మీ వల్లే నాకు ఈ ట్యాబ్ వచ్చింద’ని కృతజ్ణతలు తెలియజేసింది, ఇలా ప్రభుత్వం నుంచి ట్యాబ్స్, ఈ ప్రభుత్వం వల్లనే తమ విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయనే భావించే విద్యార్థులు వందలు, వేలల్లో ఉంటే – మీ అయిదేళ్ల పాలనలో మీరు అనుకున్నది సాధించాననే తృప్తి మీకు కలుగుతుందా ?
జగన్: కచ్చితంగా … ఈ యాభై ఆరు నెలల్లో నేను అనుకున్నవి చేయగలిగానని నా మనస్సాక్షికి నేను ధైర్యంగా చెప్పుకోగలను, ఈ యాభై ఆరు నెలల్లో నా పాలన ద్వారా కొన్ని కోట్ల మందికి చేరువయ్యాననీ చెప్పగలను … ఈ క్షణం నేను దిగిపోవాల్సి వచ్చినా కూడా ఎటువంటి బాధా లేకుండా మనస్ఫూర్తిగా, ఆనందంగా వెళ్లిపోగల ఆత్మసంతృప్తి నాకుంది.
ఇవి – రెండు వేరు వేరు ప్రశ్నలకు జగన్ ఇచ్చిన సమాధానాలు. కానీ ఒక వర్గం మీడియా పైన చెప్పిన రెండు వేర్వేరు ప్రశ్నలకు, జగన్ ఇచ్చిన సమాధానాల్ని సందర్భం నుంచి విడదీసి ‘దేవుడే గుణపాఠం చెబుతాడు’, ‘ఈ క్షణం నేను దిగిపోవాల్సి వచ్చినా కూడా..’ అనే మాటల్ని కలుపుతూ వాటికి వక్రభాష్యం జోడించింది – ‘దేవుడి పై భారం వేసిన జగన్’, ‘ఓటమిని పరోక్షంగా అంగీకరించిన జగన్’ వంటి స్క్రోలింగులతో హోరెత్తించింది. అసలు విషయం తెలియని, తెలుసుకోడానికి ఇష్టపడని, సామాజిక మాధ్యమాల్లోని జగన్ ద్వేషులు ఎప్పటిలాగే ఆ ప్రచారాన్ని ఉధృతం చేశారు.
పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, రాబోయే పది సంవత్సరాలకు సిద్ధం చేసుకున్న కార్యాచరణ గురించి జగన్ విశదీకరించి చెప్పిన విషయాలు జనంలోకి వెళ్లకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఒక వర్గం మీడియా వ్యవహరించడం ఏ మాత్రం క్షమార్హం కాదు.
ఆ ‘ఒక వర్గం’ మీడియా వారు ఎప్పుడూ మర్చిపోతూనే ఉన్నారు సరే… కనీసం ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాతైనా పైన దేవుడున్నాడనే విషయం గుర్తించాలి కదా ?!
– రావూరి.