ముస్లింల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడవనే భయం చంద్రబాబు నాయుడిని వెంటాడుతోంది. అందుకే వారిని మచ్చిక చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. శనివారం నుంచి బాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం నగరంలోని కోటమిట్ట షాదీమంజిల్‌లో వారితో సమావేశం నిర్వహించారు. వాస్తవానికి ఇది షెడ్యూల్లో లేదు. కొన్ని గంటల ముందే ప్లాన్ చేసి నిర్వహించారు.
తెలుగుదేశం ఎన్డీఏలో చేరడం.. ఈసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని కమలం పెద్దలు ప్రకటించడంతో ముస్లింలు చంద్రబాబు గ్యాంగ్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆ వర్గం తమకు దూరమైందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. బాబు ప్రచారంలో భాగంగా తాను వెళ్లిన ప్రతి నియోజకవర్గంలో ముస్లింలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అయినా టీడీపీపై వారికి నమ్మకం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మేము మీకు వ్యతికం కాదని, అండగా నిలవాలని బాబు బతిమిలాడుకున్నారు.
నెల్లూరు సిటీలో ముస్లిం అయిన ఖలీల్ అహ్మద్ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ వర్గానికి టికెట్ ఇవ్వడం నచ్చకే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరారు. తమ నుంచి ముస్లింలు దూరమయ్యారనే భయంతో ఆయన, సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ కలిసి నెల్లూరులో సమావేశాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేయించారు. దీని ముస్లింలకు వ్యతిరేకం కాదనే సంకేతాలు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పంపొచ్చని భావించారు. బాబు సమావేశానికి డివిజన్లలోని ముస్లింలను తీసుకురావాలని నారాయణ, వేమిరెడ్డి ఇన్చార్జిపై ఒత్తిళ్లు తెచ్చారు. శనివారం రాత్రి నుంచి నేతలంతా వారి ఇళ్ల చుట్టూ తిరిగారు. బాబు ముఖం చూడొద్దని, స్థానికంగా ఉన్న తమను చూసి రావాలని బతిమిలాడుకున్నారు. మీ కోసం ఏమైనా చేస్తామని ఈ ఒక్కసారికి కోటమిట్టకు వచ్చి మీటింగ్‌లో పాల్గొనాలని అడుకున్నంత పని చేశారు. అయినా చాలామంది వ్యతిరేకత చూపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ముందు ఆలోచించకుండా ఇప్పుడొచ్చి మేం అండగా ఉన్నామని చెబితే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
మొత్తానికి అతి తక్కువ మందితో సమావేశం పెట్టి మమ అనిపించారు. బాబు ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు సమావేశం మొత్తం టోపీ పెట్టుకుని దర్శనమిచ్చారు. కానీ ఇప్పటి వరకు నారా వారు రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పెద్దలతో మాట్లాడతాం. అవి ఎత్తేయకుండా చూస్తామని ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఈ మాట చెబితే ఎక్కడ నరేంద్రమోదీ, అమిత్‌షా కన్నెర్ర చేస్తారని ఆయన భయం.