తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి నిన్న విడుదల చేసిన టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై ఊహించని విధంగా కామెంట్లు వస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి స్వయానా అన్న అయినటువంటి నాగబాబు దగ్గర నుంచి రావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి ధీటుగా ఎన్నో ఆశలతో తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలు ఎదురుచూస్తున్న టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై సొంత పార్టీ నేతలే అపనమ్మకాన్ని వ్యక్తం చేయటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలన్నీ నెరవేర్చడం అందరికీ సాధ్యం కాదని, ఇచ్చిన హామీలలో కొంతమేరకు నెరవేర్చే ప్రయత్నం చేయొచ్చు గాని పూర్తిగా నెరవేర్చే పరిస్థితులు ఏ రాజకీయ పార్టీకి ఉండవు అంటూ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై వ్యాఖ్యానించారు. అయితే సొంత పార్టీ నాయకులే ఇచ్చిన హామీలు అమలుచేయలేమని చేతులెత్తేస్తే క్యాడర్ కి ఎలా నమ్మకం కుదురుతుంది? పార్టీ గెలుపు కోసం అడుగులు ఎలా ముందుకు వేయగలుగుతాం? జనంలోకి వెళ్లి ఏ మొహం పెట్టుకొని కూటమికి ఓటేయండి అని అడగాలి అనేటువంటి ప్రశ్నలు ఆయా పార్టీల కార్యకర్తల నుంచి ఎదురవుతున్నాయి.
అయితే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోపై మరింత నమ్మకం కలిగేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తుంది. ఒక రకంగా జగన్ మేనిఫెస్టోకి టీడీపీ జనసేన నేతలే సర్టిఫికెట్ ఇస్తున్నారని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే గతంలో కూడా ఇంతకంటే ఎక్కువగానే హామీలు ఇచ్చిన టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి 2014 ఎన్నికల అనంతరం ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే త్వరలో జరగబోయే ఎన్నికల ఫలితాల అనంతరం 2014లో లాగానే ఈ 2024 టిడిపి జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా వెబ్సైట్ నుంచి మాయం అవుతుందని నెటిజన్ల నుండి సెటైర్లు వినిస్తున్నాయి.