ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నేడు ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ మొదటి విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ‘సిద్ధం’ సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 21 పార్లమెంట్ నియోజకవర్గాలలో కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజులపాటు కొనసాగనున్న ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రజలతో మమేకం కానున్నారు.
బస్సుయాత్ర తొలిరోజు షెడ్యూల్ ఇలా ..
బుధవారం ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బయలుదేరి మధ్యాహ్నం 1గంటకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని అక్కడ నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను జగన్ ప్రారంభిస్తారు. నేడు ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం సున్నంపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరానికి జగన్ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.