‘అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకు విరాళాన్ని అందించాను’ సోషల్ మీడియాలో సినీ నటుడు చిరంజీవి పోస్టు ఇది. దీంతో ఆయన అధికారికంగా ముసుగు తీసేసి సేనకు అండగా ఉన్నట్లు ప్రకటించేశారు. కానీ ఈ మెగా బ్రదర్స్ రాజకీయ జీవితం చూస్తే అంతా స్వార్థమే కనిపిస్తుంది.
సామాజిక న్యాయం కోసమంటూ చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించారు. ఆనాడు ఆయన, నాగబాబు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా తిరిగారు. కానీ అనుకున్న సీఎం పదవి దక్కలేదు. చిరు పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలాగే చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకుని పవర్ ఎంజాయ్ చేశారు. ఈ నిర్ణయం తనకు నచ్చలేదని, దీంతో అన్నకు దూరంగా ఉన్నానని ఓ సందర్భంలో సేనాని వ్యాఖ్యానించారు. వారి మధ్య గ్యాప్ ఉన్నట్లు అందరూ భావించేలా చేశారు.
పీఆర్పీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ 2009 ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. 2014లో జనసేనను స్థాపించారు. అయితే చిరంజీవి, నాగబాబు దూరంగానే ఉన్నట్లు కనిపించారు. సేనాని.. చంద్రబాబు నాయుడితో తిరుగుతూ వేల కోట్ల రూపాయలు మూటగట్టాడని విమర్శలున్నాయి. పవన్ కూడా మెగా ఫ్యామిలీతో సంబంధం లేదన్నట్లుగా నటించినట్లు తెలుస్తోంది. ఓ సినిమా ఫంక్షన్లో నాగబాబు ‘పిలిచాం. వాడు రాకపోతే మేమేం చేస్తాం. మీరు మాపై పడొద్దు’ అన్నారు. దీంతో బ్రదర్స్ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అదంతా అబద్ధమని తేలిపోయింది.
పీఆర్పీ మూతపడడానికి ప్రధాన కారణం చంద్రబాబు, ఎల్లో మీడియా. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఆ పార్టీని మూసేస్తున్నారంటూ రాశాయి. తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని పచ్చ గ్యాంగ్ ప్రయత్నిస్తోందని చిరంజీవి అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా చివరికి వారి బాధ భరించలేక ఆయన పార్టీని మూసేశారు. అదే వ్యక్తులతో పవన్ కళ్యాణ్ 2014 నుంచి అంటకాగుతున్నాడు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి బహిరంగంగా మద్దతు ఇచ్చాడు. 19లో బాబు డైరెక్షన్లో ఒంటరిగా పోటీ చేశాడు. 24లో అయితే పొత్తులో భాగంగా సేనాని టికెట్లు తీసుకున్నాడు. పీఆర్పీని తొక్కేయడానికి ప్రయత్నించిన వారితో ఎలా తిరుగుతావని చిరు తన తమ్ముడిని ఏనాడూ ప్రశ్నించలేదు. పైగా మెగా కుటుంబం మొత్తం మద్దతు, డబ్బు ఇచ్చేలా ప్రోత్సహించాడు. మరోవైపు పీఆర్పీ మూతపడ్డానికి కారణం ఎవరో తనకు బాగా తెలుసని, ఏనాటికైనా వారి అంతు చూస్తానని ప్రకటించిన పవన్ పదేళ్లుగా ఎల్లో గ్యాంగ్ నీడలోనే సేద తీరుతున్నాడు.
ఇక నాగబాబు విషయానికొస్తే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణను కించపరిచేలా గతంలో వీడియోలు చేయించాడు. తాను పలు ఇంటర్వ్యూల్లో వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొన్నేళ్లుగా జనసేనలో ఉంటూ అతను ఎల్లో సపోర్టర్‌గా మారిపోయాడు. పొత్తు సమావేశాల్లో బాబు పక్కన నిలబడి ఫొటోకు ఫోజిచ్చాడు. మెగా బ్రదర్స్ ఆలోచన ఒక్కటే. అధికారం కావాలి. కుదరకపోతే డబ్బు కావాలి. మొదటి నుంచి వారి రాజకీయ అడుగులు అలాగే పడుతున్నాయి.
తమ్ముడు ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్నాడని పెద్దన్న అంటాడు. కానీ అతను తిరిగేది అవినీతి అనకొండ అయిన చంద్రబాబుతో. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న బాబు ఏనాడూ ప్రజలకు మంచి చేయలేదు. 09 ఎన్నికల ప్రచారంలో చిరు కూడా టీడీపీ ఎండగడుతూ ప్రచారం చేశారు. మరి అలాంటి దుర్మార్గుడితో చేరిన పవన్ ప్రజాసేవకుడు ఎలా అవుతాడో.. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే తమ్ముడని చిరు అన్నారు. తమ్ముడు వీలు చిక్కినప్పుడల్లా వసూళ్లు చేయడం తప్ప ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు. ఇంకా ఊర్లకు వెళ్లి కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించి ఒక్క పైసా కూడా ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి. మొత్తానికి మెగా బ్రదర్స్ పీఆర్పీ మూతకు కారణమైన చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని తేలిపోయింది. వారు ముగుసులు తొలగించి జనానికి క్లారిటీ ఇచ్చేశారు.