‘మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున టీడీపీ, జనసేన, జనసేన నాయకులు గురువారం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమారికి సమర్పించారు. పత్రాల సమర్పణలోనూ లోకేశ్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. ఆయన తరఫున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నాయకులున్నారు. లోకేశ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అంతకుముందు మంగళగిరి సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పదివేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.’ ఇది ఈనాడు వెబ్సైట్లో వచ్చిన వార్త. అదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫేస్బుక్ పేజీలో అయితే భారీ ర్యాలీతో లోకేశ్ నామినేషన్ అని వేశారు.
జనాన్ని గొర్రెలు చేయడంలో పచ్చ మీడియా ఎప్పుడూ ముందుంటుంది. లోకేశ్ రాకపోయినా వచ్చాడన్నట్లుగానే బిల్డప్ ఇచ్చింది. నిజానికి మంగళగిరిలో పోటీ చేయడం చినబాబుకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని తండ్రి చంద్రబాబు నాయుడికి కూడా చెప్పాడు. కానీ ఆయన ఒప్పుకోకపోవడంతో అయిష్టంగానే బరిలోకి దిగాడు. నామమాత్రంగా ప్రచారం చేస్తూ హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నాడు. గెలుపుపై నమ్మకం లేకపోవడంతోనే లోకేశ్ నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో బాబు కూడా తనయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడని సమాచారం. పార్టీ జాతీయ కార్యదర్శి కావడంతో బిజీగా ఉన్నాడని తెలుగు తమ్మళ్లు ప్రచారం చెబుతున్నారు.
నామినేషన్ కార్యక్రమానికి మంగళగిరి పట్టణం, తాడేపల్లి, దుగ్గిరాలకు సంబంధించిన ముఖ్య నేతలు గైర్హాజరు కావడంతో తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఓటమి భయంతోనే చినబాబు రాలేదని ప్రచారం ఉంది. దీనిని కవర్ చేయడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీల చేత నామినేషన్లు ఇప్పించాడని ఎల్లో మీడియా డబ్బా కొడుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మంగళగిరిలో ముచ్చటగా మూడోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.