ఆంధ్రప్రదేశ్ లో తిరిగి రెండోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అభిప్రాయాన్ని మీడయా ప్రతినిధులతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోలింగ్ సరళితో పాటు ఏపీకి చెందిన వివిధ రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడి తాను ఒక అంచనాకి వచ్చినట్టు వెల్లడించారు.
తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన కేటీఆర్, తెలంగాణ రాజకీయాలపై స్పందించిన అనంతరం మీడియా ప్రతినిధులు ఏపీలో జరిగిన ఎన్నికల సరళిపై తన అభిప్రాయాన్ని కోరగా పై విధంగా స్పందించారు. కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఏపీలో మళ్ళీ రాబొయేది జగనే అనే స్పష్టమైన అంచనాలు తమ దగ్గర ఉన్నాయని ఒక ప్రముఖ ఛానల్ కి చెప్పిన విషయం తెలిసిందే.
పలు సర్వేలు , పలువురు రాజకీయ నాయకులు , మీడియా ప్రతినిధులు ఏపీలో మళ్ళీ జగన్ సర్కారే రాబోతుంది అని చెప్పడం చూస్తే తెలుగుదేశం పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యేలానే ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమౌతుంది. మళ్ళీ జగన్ రాబోతున్నాడని తెలుగుదేశంలోని కొందరి నేతలకి స్పష్టమైన అవగాహన ఉన్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనే వాదన ఉంది. ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారనేది మరి కొద్దిరోజుల్లో తేలిపోనుంది.