జంగా కృష్ణమూర్తి అనే గాలిపటం కొద్దిరోజుల క్రితం తెగిపోయి ఎటెటో తిరిగింది. మళ్లీ పాత గూటికే చేరేందుకు తీవ్ర ప్రయత్నాయాల్లో ఉంది. ఆదరించి అండగా నిలిచిన పార్టీ అయితేనే మర్యాద ఉంటుందని గుర్తించి సంబంధాలు పునరుద్ధరించే పనిలో పడ్డారు ఈ సీనియర్ నాయకుడు.
జంగా తెలుగుదేశం మద్దతుతో 1988లో గామాలపాడు సర్పంచ్‌గా గెలిచారు. 1999లో కాంగ్రెస్ టికెట్‌పై గురజాల ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. 2004లోనూ గెలుపొంది టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019 గురజాల నుంచి కాసు మహేష్‌రెడ్డిని బరిలోకి దింపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారు దీంతో జంగాకు అన్యాయం జరగకూడదని ఎన్నికలకు ముందే ఆయన్ను ఎమ్మెల్సీ చేసి గౌరవించారు. కాసు గురజాలలో గెలుపొంది తన మార్క్ చూపించారు.
19 ఎన్నికలయ్యాక జగన్ జంగాను బీసీ విభాగానికి అధ్యక్షుడిని చేశారు. పార్టీలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన పదవులు అనుభవించారు. అయితే 2024 ఎన్నికలు వచ్చే సరికి కృష్ణమూర్తి గురజాల సీటు కోసం పేచీ పెట్టారు. అధిష్టానం అంగీకరించలేదు. దీంతో జంగా.. లావు శ్రీకృష్ణదేవరాయులుతో కలిసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడి ప్రాపకం కోసం జగన్‌పై అసత్యాలను ప్రచారం చేశారు. యరపతినేని శ్రీనివాసరావును నరసారావుపేటకు పంపి జంగాకు గురజాల స్థానం ఇవ్వాలని తెలుగుదేశం పెద్దలు ఒక దశలో ఆలోచన చేశారు. అయితే యరపతినేని తాను వెళ్లనని తెగేసి చెప్పాడు. దీంతో కృష్ణమూర్తిని నరసారావుపేట నుంచి పోటీ చేయాలని చెబితే ససేమిరా అన్నారు. ఇతను యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్‌ను దెబ్బ కొట్టేందుకు ఇలా ఎత్తు వేశారు. అయితే కార్యరూపం దాల్చలేదు. దీంతో లావుతోపాటు టీడీపీలో చేరాల్సిన జంగా వెనుకంజ వేశారు.
వైఎస్సార్సీపీలో ఉండుంటే కృష్ణమూర్తి రాజకీయ జీవతం బాగుండేది. కానీ టీడీపీలో చేరాలని ప్రయత్నించడంతో ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆయనకు టికెట్ ఇచ్చే దారులు పూర్తిగా మూసుకుపోవడంతో తిరిగి పుట్టింటికే రావాలని తహతహలాడుతున్నాడు. ఇతర పార్టీలు తనను పట్టించుకోవని, జగన్ మాత్రమే బాగా చూసుకుంటారని అర్థం చేసుకున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డి, నరసారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ ఆయనతో మాట్లాడినట్లు తెలిసింది. కళ్లు తెరుచుకోవడంతో జంగా తిరిగి వైఎస్సార్సీపీ గూటికే చేరనున్నారు.