‘రాజకీయాలను మార్చేస్తా. కొత్త వారిని తీసుకొస్తా. సామాన్యులకు అవకాశాలిచ్చి చట్టసభలకు పంపిస్తా’ అంటూ జనసేనఅధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేక సమావేశాల్లో చెప్పాడు. తీరా చూస్తే జనం చెవుల్లో పూలు పెట్టి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పిన వారికే టికెట్లు ఇచ్చాడు. మందు నుంచి అందరూ అనుకుంటున్నట్లుగా సేన నేతలకు వెన్నుపోటు పొడిచి వలస నేతలకు బీ ఫారాలు ఇచ్చాడు.
చంద్రబాబు తన మనుషులు కొందరిని సేనలోకి పంపి టికెట్లు ఇప్పించుకున్నాడు. వారిలో నిమ్మక జయకృష్ణకు పాలకొండలో, అరవ శ్రీధర్‌కు రైల్వే కోడూరులో, మండలి బుద్ధ ప్రసాద్‌కు అవనిగడ్డలో, పులపర్తి రామాంజనేయులుకు భీమవరంలో, కొణతాల రామకృష్ణకు అనకాపల్లిలో, ధర్మరాజుకు ఉంగుటూరులో పవన్ అవకాశమిచ్చాడు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ వివిధ సమీకరణాల నేపథ్యంలో కొందరికి టికెట్ నిరాకరించింది. దీంతో తాను అవకాశం ఇప్పిస్తానని చంద్రబాబు వారిని మభ్యపెట్టారు. టీడీపీలోకి తీసుకోకుండా జనసేనలోకి పంపి ఆ కోటాలోనే టికెట్లు ఇవ్వాలని పవన్‌ను ఆదేశించారు. ఈ విధంగా వంశీకృష్ణ యాదవ్‌కు వైజాగ్ సౌత్‌లో, ఆరణి శ్రీనివాసులుకు తిరుపతిలో, పంచకర్ల రమేష్‌బాబుకు పెందుర్తిలో చాన్స్ వచ్చింది. ఇక మచిలీపట్నం ఎంపీ సీటును బాలశౌరికి ఇచ్చారు.
పవన్ చంద్రబాబు నుంచి తీసుకున్న సీట్లే తక్కువ. 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలు తీసుకున్నాడు. అందులో పదింటిని టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలకే ఇచ్చాడు. తనను ప్రశ్నించే సమూహం వద్దని, ఏం చేసినా చూస్తూ ఉండేవారే కావాలని సేనాని ఎందుకన్నాడని కార్యకర్తలకు ఇప్పుడు అర్థమవుతోంది. ఇతర పార్టీల నేతలకు సీట్లు ఇచ్చేందుకా సేనను స్థాపించిందని ప్రశ్నిస్తున్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. వారికి చేయూతనందించాలని పవన్ అనేక స్పీచ్‌లు ఇచ్చాడు. తీరా టికెట్ల విషయానికొస్తే లోకం మాధవికి నెల్లిమర్లలో అవకాశం ఇచ్చాడు. ఇంకెక్కడా మహిళలను బరిలోకి దించలేదు. అనేక నియోజకవర్గాల్లో టికెట్లు ఇస్తానని డబ్బు ఖర్చు పెట్టించి వారికి అన్యాయం చేశాడు. పవన్ మాటలకు.. చేతలకు సంబంధమే ఉండదని మరోసారి రుజువైంది.