ఈ రోజు నరసరావుపేటలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం జన జాతరను తలపించింది. ముందుగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దంపతులు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి రామిరెడ్డి నగర్ లోని అభయ ఆంజనేయస్వామి గుడి దగ్గరనుండి భారీ ర్యాలీగా వేలాది మంది కార్యకర్తలు అభిమానులు వెంట రాగా జగన్, అనిల్ కుమార్ యాదవ్, గోపిరెడ్డి నినాదాలతో హోరెత్తిస్తూ బయలుదేరి పల్నాడు రోడ్డు మీదుగా గడియార స్థంభం సెంటర్ చేరుకుని అక్కడినుండి ఆర్డీఓ కార్యాలయం కు చేరుకున్నారు. ప్రధానంగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో యువత పెద్దయెత్తున పాల్గొని అనిల్ కుమార్ యాదవ్ కు పూలదండలతో ఎక్కడిక్కడ స్వాగతం చెబుతూ ర్యాలీ వెంబడి పరుగులు పెడుతూ తమ నినాదాలతో నర్సరావుపేట దద్దరిల్లెలా చేశారు.
మరి ముఖ్యంగా పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి బీసీలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వైసీపీ నాయకత్వం ఇవ్వడంతో అనిల్ కుమార్ యాదవ్ కు మద్దతుగా వైసీపీ కార్యకర్తలే కాకుండా బీసీ కుల సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ర్యాలీ పొడుగునా వైసీపీ జెండాలతో పాటు బీసీ కులాలు జెండాలు రెప రెపలడాయి. బహుశా పల్నాడు చరిత్రలో ఇలాంటి ర్యాలీ ఎప్పుడు చూడలేదేమో అనిపించేలా జరిగిన యాత్ర తర్వాత ఆర్డివో ఆఫీసుకు చేరుకొని నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అంతకు ముందు అనిల్ కుమార్ యాదవ్ తరుపున మొదటి సెట్ ను ఆయన భార్య జాగృతి, పార్టీ సీనియర్ నాయకులు గజ్జెల బ్రహ్మరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన శివ శంకర్ కు నామినేషన్ కు సంబంధిన పత్రాలను దాఖలు చేశారు.
నామినేషన్ల కార్యక్రమం తర్వాత ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎంపీ గా మంచి మెజారిటీ తో విజయం సాధించబోతున్నము అలాగే ఏడుకి ఏడు అసెంబ్లీ సీట్లు గెలుచుకోబోతున్నామని ప్రకటించారు.