రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.వందలాది కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినందుకు చంద్రబాబుతో పాటు పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు రిమాండ్ ఉత్తర్వులను సైతం కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టేశారు.
అందుకుగానూ ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, మరో న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డిని లక్ష్యంగా సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తాయి. అంతేకాకుండా విమర్శలు, దూషణలు కూడా తారాస్థాయికి చేరాయి. అడ్డుఅదుపు లేకుండా కొందరు వ్యక్తులు ప్రత్యేక్ష పరోక్ష ఆరోపణలకు దిగారు. అయితే.. న్యాయవ్యవస్థపై జరుగుతున్న ఈ దూషణలపై న్యాయవాది వసంత్‌కుమార్, హైకోర్టు న్యాయవాది ఎం.సుజాత లిఖితపూర్వకంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు, విమర్శలు చేసిన వారిపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు.
మంగళవారం.. ఈ కేసుపై విచారణ జరపగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులు, న్యాయాధికారిపై పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ను యూట్యూబ్ ఇప్పటికీ తొలగించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించిన వెంటనే సామాజిక మాధ్యమ సంస్థలు తమ ఆన్లైన్ వేదికలపై ఉన్న పోస్టులన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది.. ప్రముఖ ఆన్లైన్ సామాజిక మాధ్యమ సంస్థలైన ఎక్స్, ఫేస్బుక్ మాధ్యమాలు తమ మాధ్యమాల్లో ఉంచిన అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ఇప్పటికే తొలగించామని హైకోర్టుకు నివేదించాయి. కానీ యూట్యూబ్ తరఫున సీనియర్ న్యాయవాది సజన్ పువయ్య వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు లేదా కేంద్రం నియమించిన అదీకృత అధికారి ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే తాము ఆ పోస్టులను తొలగిస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అసభ్య, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్‌ను ఆదేశించింది. కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఎల్లో మీడియా చానల్స్ టీవీ 5, మహాన్యూస్, మైరా మీడియా సంస్థలను హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది.