వైఎస్సార్సీపీపార్టీ అధికారంలోకి వచ్చాక తీసుకొన్న నిర్ణయాల పై, అమలు చేసిన పధకాల పై కోర్టుల్లో వేసిన పిటిషన్స్ కాటాకేస్తే క్వింటాల్లో తూగుతాయేమో, ఒకటా రెండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పై కేసు, పేదలకి ఇచ్చే ఇళ్ల స్థలాల పైన కేసు, ఇంటింటికి తిరిగి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షించే వలంటీర్ వ్యవస్థ పై కేసు, స్థానిక ఎన్నికల నిర్వహణ పై కేసు, ఇలా రోజుకి నాలుగు చొప్పున కేసులు వేస్తూనే ఉన్నారు. వాటి ఫలితాలు పక్కన బెడితే వాటి వెనక ఉన్నది ఎవరో అందరికీ తెలిసిన విషయమే. ప్రజా క్షేత్రంలో తనకు వ్యతిరేకంగా జరిగినది, లేదా ప్రజలకి మేలు జరిగేది ఏదైనా చట్ట, న్యాయ వ్యవస్థలోని సున్నిత అంశాల్ని అడ్డం పెట్టుకొని కోర్టుల్లో లిటిగేషన్లు పెట్టగల ఏకైక సమర్ధుడు చంద్రబాబు. కేసుకి కాదేది అతీతం అని చివరికి ముఖ్యమంత్రి ప్రసంగం పై కూడా వేసిన పిల్ వెనక ఎవరున్నారనేది మీకు చెప్పనవసరం లేదనుకొంటా.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం చట్టవిరుద్ధమంటూ కోర్టును ఆశ్రయించిన వారికి హైకోర్టు బుద్ధి చెప్పింది. ఇటీవల పల్నాడు జిల్లాలో నిర్వహించిన గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్షనేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది.
పిల్ విచారణలో భాగంగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చట్ట విరుద్దంగా ప్రకటించడం ఏమిటంటూ హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో ఏర్పా టైన జన్మభూమి కమిటీలను, ప్రస్తుతం తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను పోల్చారని, దీనిని తామెలా తప్పుపట్టగలమని ప్రశ్నించింది. అలా పోలిక తేవడానికి వీల్లేదంటారా అంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వలంటీర్లు మంచి పనిచేయడంలేదా? మంచి చేసిన వాళ్లను సన్మానించకూడదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఖర్చు చేసిన మొత్తాన్ని ముఖ్యమంత్రి నుంచి వసూలు చేయాలని ఎలా కోరతారు అంటూ ప్రశ్నించింది. విచారణ అనంతరం పిల్ ను ధర్మాసనం కొట్టేసింది.