తన రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని..అది ఏమైనా సంజీవినా అన్నది ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా గతంలో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాలుక ఎన్ని మడతలు పడిందో రాజకీయాలు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు గతంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఎలా స్పందించారో ఓసారి తొంగి చూస్తే తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతుంది.
ప్రత్యేక హోదాపై వివిధ సందర్భాల్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలివీ
ఏప్రిల్ 29, 2014 : (ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ) మనకు ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామంటున్నారు. ఐదేళ్లు, పదేళ్లు కాదు, 15 ఏళ్లు ఇవ్వండి అని మోదీగారిని కోరుతున్నా.
02.06.2015 : (ఎన్నికలు ముగిశాక విజయవాడ నవనిర్మాణ దీక్షలో మాట్లాడుతూ) ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదు
ఆగస్టు 25, 2015 : ( న్యూఢిల్లీలో ప్రధానితో భేటీ తర్వాత చంద్రబాబు )ప్రత్యేక హోదా ఏమీ సంజీవిని కాదు
12.08.2015 : (విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో)హోదాతోనే అన్నీ రావు. కోడలు మగ పిల్లాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా?
18.05.2016: హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వక పోతే ఏం లాభం? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?
19.05.2016: హోదాతోనే అంతా కాదు. అదేమీ సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రధానికి విన్నవించా…
08.09.2016: మనకు ప్రత్యేక హోదా వీలు కాదన్నారు. అదే స్ఫూర్తితో సమాన ప్రయోజనాలు ఇస్తామంటే వాటిని తీసుకోకుండా ఏం చేద్దాం?
09.09.2016: ప్రత్యేక హోదా ఇవ్వలేం. కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలను లెక్కించి ఆ మేరకు నిధులిస్తామని అరుణ్‌జైట్లీ చెప్పారు. వారు ఇచ్చింది తీసుకుంటాం. అదే సమయంలో మనకు రావాల్సింది అడుగుతాం.
10.09.2016: హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించొద్దని కోరుతున్నా.
11.09.2016: హోదా వస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం. కేంద్రం చెప్పిన దాని కన్నా అదనంగా ఏం వస్తాయో చెప్పమనండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్రాలు అభివృద్ధి చెందలేదు.
18.09.2016: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. దాని వల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం.
23.09.2016: హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్యాకేజీపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం.
26.09.2016: హోదా అంటే జైలుకే.! బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విద్యార్థుల తల్లి దండ్రులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక.
05.10.2016: కేంద్రం నుంచి పది రూపాయలు ఎక్కువే రాబట్టాలని చూస్తా. ప్రత్యేక హోదాలో వస్తున్నవన్నీ ఇస్తున్నందుకే ప్యాకేజీని ఒప్పుకున్నాం.
29.10.2016: ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు.
04.02.2017: హోదా వేస్ట్. హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు.
17.03.2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు, ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు, ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తున్నాం.
06.06.2017: ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలు ఏమిటి? అదనంగా వచ్చేదేమిటి? ప్యాకేజీకి, ప్రత్యేక హోదాకు వ్యత్యాసం ఏమిటి? ప్యాకేజీలో లేనిదేంటి? నేను దేశంలో సీనియర్ నేతను. నేను ఎవరికీ భయపడాల్సిన పని లేదు.
27.02.2017: ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని కొందరు మభ్య పెడుతున్నారు.
02.03.2018: పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డంకులున్నాయి.
ప్రత్యేక హోదా విషయంలో ప్లేట్ ఫిరాయించిన బాబు
06.03.2018 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నదే మన డిమాండ్, ఎవరూ ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రస్తావన కూడా తేవద్దు. ప్రత్యేక హోదా గురించే అందరూ మాట్లాడాలి.
08.03.2018 : కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నాం. మా మంత్రులు రాజీనామా చేస్తారు.
10.03.2018 : వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వం.
15.03.2018 : వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం. కొందరు కావాలనే కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్నారు.
16.03.2018 : మేమే కేంద్రంపై అవిశ్వాసం పెడతాం. వైఎస్సార్ సీపీ తీర్మానానికి మద్దతు ఇవ్వం.
24.03.2018 : హోదా కాకపోయినా ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు ఇచ్చినా మాకు ఓకే.
2018 మే : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
21.07.2018 : ప్రత్యేక హోదాకు బదులుగా నేను ఎప్పుడూ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించలేదు.
25.07.2018 : ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి.
18.09.2018 : ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తాం.
20.09.2018: ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టంపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం.
11.10.2018 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయాలని 15వ ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
12.12.2018: (టీడీపీ నాయకులతో చంద్రబాబు) మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మోదీ గద్దె దిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్నా.
16.12. 2018: దేశంలోని అన్ని వ్యవస్థలను మోదీ నాశనం చేశారు. నా జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు.
20.1. 2019 : (కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు)మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారు. మోదీని సాగనంపేంతవరకూ నిద్రపోకూడదు.
9.2. 2019: మోదీ రాష్ట్రానికి ఎలా వస్తారు? మోదీ పర్యటన ఏపీకి చీకటి రోజు, దుర్దినం. ఆయన పర్యటించే రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపాలి.
11.2.2019: విభజన హామీలను అమలు చేయాలని ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు దిగిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని దుయ్యబట్టారు..
కట్ చేస్తే రాష్ట్రాన్ని ప్రధాని మోదీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోసం చేసారని చెబుతూ ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. తిరిగి గెలిచే అవకాశం లేదని గుర్తించిన చంద్రబాబు తిరిగి తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు కోసం, ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల ప్రసన్నం కోసం తహతహలాడారు. విభజన హామీలను అమలుచేయలేదని మోదీని దూషించిన నోటితోనే ప్రజాగళం సభలో ఆకాశమే హద్దుగా మోదీని పొగిడారు. తనకు తన రాజకీయ స్వప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర ప్రయోజనాల గురించి తనకు అనవసరమని ప్రజలకు తేల్చి చెప్పారు.