2024 సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి కూటమి నేతల మేనిఫెస్టో విడుదల తర్వాత సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. కూటమి మేనిఫెస్టోకి బీజేపీ అండ లేకపోవడం ఏంటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం ఎందుకు లేదో ప్రజలకి వివరించాలని వెల్లడించారు. కూటమినేతల చెబుతున్నట్లు బీజేపీ జాతీయస్థాయిలో మేనిఫెస్టో ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీజేపీ పలు రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైన మేనిఫెస్టో ఎందుకు ప్రకటించలేదో చూస్తుంటే 2014 లాగే మరోసారి ప్రజలని మోసం చేయడానికి కూటమి సిద్ధంగా ఉందని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండి పడ్డారు.
కూటమి మేనిఫెస్టోలో విభజన హామీలకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన తీసుక రాకపోవడం ఏంటని, ప్రత్యేక హోదా గురించి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఎన్డీఏతో జత కట్టిన తర్వాత ప్రత్యేక హోదా గురించి ఎటువంటి హామీ తీసుకోకపోవడం, విశాఖ ఉక్కు గురించి ప్రస్తావన లేకపోవడం, పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే చెప్పకపోవడం, రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే ఈ మాయ మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు సమీక్షించి ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తామన్న బీజేపీ ప్రకటనలపై టీడీపీ, జనసేనలు తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజలు మరోసారి మీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేరని .. పైన అడిగిన వాటి గురించి బీజేపీ నుంచి సరైన ప్రకటన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.