సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలును వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ రకంగా ఆ పథకాలను మరల తీసుకొస్తుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్నమొన్నటి వరకు పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జనం సోమరులైపోతారు, జాతీయసంపద ఆవిరైపోతోందన్న టీడీపీ వాళ్లు ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో అంతకంటే ఎక్కువ హామీలు ప్రకటించడం మోసం చేయడానికి కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఇప్పుడు శ్రీలంక, వెనుజులా కాదా అని అడిగారు.
టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది సూపర్ సిక్స్ కాదని, అవి చీటింగ్ సిక్స్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 32,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని, సూపర్ సిక్స్ లో మాత్రం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా ప్రకటన చేస్తారని విమర్శించారు. అభివృద్ధికి అవకాశం లేని చోట చంద్రబాబు రాజధానిని ఎలా నిర్ణయిస్తాడని ప్రశ్నించారు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూములలో రాజధాని నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చిందిని అడిగారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని, ఐదువేల నుంచి ఆరువేల ఎకరాల్లో నిర్మించవచ్చు అని అన్నాడు. టిడిపి చేసిన తప్పిదం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు అన్నారు.
భూములు దోచుకోవడంలోనే టిడిపి ఐదేళ్ల పాలన గడిచిపోయింది అని రాజధాని నిర్మాణంలో రష్యా, చైనా, సింగపూర్, జర్మనీ, టోక్యో నమూనాలు అంటూ టీడీపీ ఐదేళ్లపాటు తిరిగి చివరకు సినీదర్శకుడు రాజమౌళితో ప్రజలకు త్రీడీ సెట్టింగులు చూపించిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా ఉంటే పునీతులుగా చెబుతున్నారని, వ్యతిరేకంగా ఉంటే ఈడీ, సీబీఐ, ఇన్ కంట్యాక్స్ దాడులతో అవినీతిపరులనే ముద్ర వేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ఎన్నికలు సామాన్యులకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు.