నెల్లూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ప్రారంభమైంది. గురువారం రాత్రే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. శుక్రవారం విశ్రాంతి తీసుకున్నారు. తాను బస చేసిన చింతారెడ్డిపాళెం నుంచి భారీ జన సందోహం నడుమ యాత్రను మొదలుపెట్టారు. జాతీయ రహదారిపై భగత్‌సింగ్ కాలనీ వద్దకు చేరుకున్న సీఎంకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు దిష్టి తీసి గుమ్మడికాయలు కొట్టారు. జగన్ వెంకటేశ్వరపురంలో టిడ్కో గృహాల లబ్ధిదారులతో మాట్లాడారు. దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న బస్సు వద్దకు చేరుకుని తమ సమస్యలు చెప్పుకొన్నారు. వారిని సీఎం ఆప్యాయంగా పలకరించారు. బాధలు విని తగిన చర్యలు తీసుకోవాలని వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. అనంతరం యాత్ర కోవూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
అంతకుముందు స్టే పాయింట్ వద్ద జగన్‌ను స్థానిక నేతలందరూ కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. నెల్లూరు జిల్లాలో ఎనిమిదికి ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో, ఒక పార్లమెంట్ స్థానంలో గెలుపే లక్ష్యంగా జిల్లా మ్యాప్ ఉన్న టీషర్ట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ స్టాంప్‌ను జగన్ వేశారు. ఈ సమయంలో నాయకులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి, పార్టీ అభ్యర్థులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మధ్యాహ్నం కావలిలో జరిగే బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పటికే వివిధ మండలాల నుంచి జనం అక్కడికి చేరుకున్నారు.