గత పాలకులు తమ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని సీఎం జగన్ వెల్లడించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో సీఎం జగన్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయే సరికే ఆ మేనిఫెస్టో తీసుకుని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి ఉందని కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పామో, దాన్ని నెరవేర్చాలా లేదా అన్న ఆలోచన కూడా చేయని అధ్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి తాను అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చానని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికల ప్రణాళిక ఇస్తే, దానిని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీనీ ఏకంగా 99 శాతం అమలు చేసి ఈరోజు మీ ముందర గర్వంగా కూడా చెబుతున్నానని జగన్ తెలిపారు.
మీ జగన్కు బాబు మాదిరిగా మోసం చేయడం రాదని, మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం రాదు. మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా అబద్ధాలతో, మోసాలతో పోటీ పడలేడని వెల్లడించారు. వాళ్లు ఎలాగూ అమలు చేసేది లేదు కాబట్టి నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే సరిపోతుంది. ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్లది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే అది కచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి, మోసాలు చేయలేడు కాబట్టే కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు ఉంచుతున్నానని సీఎం జగన్ వ్యాఖ్యానించారు