‘చంద్రబాబూ నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేశావా అంటే సమాధానం రాదు. కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏంటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్‌ను తిట్టి పెడితే ఏం ప్రయోజనం? ఎవరు ఇంటింటికీ మంచి చేశారు?, ఎవరు అందరినీ మోసం చేశారు, వారి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు.
గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అందించాం. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్ధానాలు అమలు చేశాం. ఒక్కమాటలో చెప్పాలంటే 58 నెలల కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కాదు. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. జగన్ గెలిస్తే దానర్థం ఈ విప్లవాత్మక మార్పులు, ఈ పథకాలన్నీ కొనసాగింపు. మరింతగా రెండడుగులు ముందుకు వేయడం. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే దానర్థం పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే.
బాబు వయసు 75 దాటింది. ఈ జీవితమంతా వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే లేనేలేదు. నేను వరుసబెట్టి స్కీముల లిస్టు చదువుతుంటే బాబుకు పిచ్చి కోపం వస్తోంది. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్. గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ జరగలేదు. బడుల్లో నాడు – నేడు, పిల్లలకు బడి తెరిచే సమయానికే విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, టోఫెల్ క్లాసులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం. క్లాస్ రూముల్లో డిజిటల్ బోర్డులు కనిపిస్తున్నాయి. బడులకు పిల్లలను పంపే తల్లులకు ప్రోత్సాహమిస్తూ అమ్మఒడి. గతంలో ఎప్పుడూ లేదు. అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ చేయూత, కాపునేస్తం, ఓబీసీ నేస్తం, ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, ఇళ్ల పట్టాలు వాళ్ల పేరిటే రిజిస్ట్రేషన్. ఇవన్నీ గతలో లేవు. మనమే చేశాం. రైతన్నలకు భరోసా, ఈ-క్రాప్, ఉచిత పంటలబీమా, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆర్బీకే వ్యవస్థ ఇవన్నీ చేశాం.
ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఆసరా అందించాం. ఇంటికే వైద్యం అందిస్తూ ఆరోగ్య సురక్ష, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, నాడు-నేడుతో బాగుపడ్డ హాస్పిటళ్లు గతానికి భిన్నంగా ఈరోజు కనిపిస్తున్నాయి. లాయర్లకు లా నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర, చిరు వ్యాపారులకు చేదోడు, తోడు, ఎంఎస్ఎంఈలకు సపోర్ట్, స్వయం ఉపాధి రంగానికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా?.
చంద్రబాబును నీ స్కీములు ఏమిటని అడుగుతున్నా. 14 ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీపేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని అడిగినందుకు బాబుకు కోపం వస్తోంది. ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? అని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడికి, వదినమ్మకు కోపం వస్తోంది. వీరితోపాటు చంద్రన్న కాంగ్రెస్‌కు కూడా కోపం వస్తోంది. మనకు కౌంటర్‌గా వారు కూడా లిస్టులు చదువుతున్నారు. కాకపోతే అవి పథకాలు కాదు. నా మీద తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాలు. అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెబుతున్నాను. ఎంతటి దారుణంగా మాట్లాడుతున్నారో తెలుసా వీళ్లంతా.. జగన్‌ను మనిషి అనాలో, రాక్షసుడు అనాలో చంద్రబాబుకు అర్థం కావట్లేదట. జగన్‌ను ఎందుకు చంపకూడదు? అని అడుగుతాడు ఈ పెద్దమనిషి. పనిలోపనిగా పాతేస్తానని చెప్పి కూడా అంటాడు. నందికొట్కూరులో, బుచ్చిరెడ్డిపాళెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలివి. చేతగానివాడికి కోపం ఎక్కువ.
అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి 2014లో ఎన్నికల వేళ హామీలిచ్చారు. ఇంటింటికీ పాంప్లెట్లు పంపారు. ఈటీవీ, ఆంధ్రజ్యోతిలో ఊదరగొట్టారు. అక్కచెల్లెమ్మల మెడలో మంగళసూత్రం ఒక చేయి లాగేస్తుంటే మరో చేయి అడ్డుకున్న యాడ్ గుర్తుందా.. బాబొస్తున్నాడు అనే అడ్వర్టైజ్మెంట్ అది. మేనిఫెస్టోలో మొదటి హామీ రూ.87,612 కోట్ల రుణమాఫీ చేశాడా? రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు అన్నాడు. రూ.12,205 కోట్లలో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? మూడో హామీ ఆడబిడ్డ పుడితే రూ.20 వేలు బ్యాంకుల్లో వేస్తానన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి వేశాడా? నాలుగో హామీ ఇంటింటికీ ఓ ఉద్యోగం, ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. ఐదేళ్లకు కలిపి రూ.1,20,000 ఇచ్చాడా?, అర్హులందరికీ మూడుసెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇల్లు అన్నాడు. ఎవరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా? ఉమన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాన్నాడు చేశాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి అన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్‌సిటీ అన్నాడు జరిగిందా? మైదుకూరులో కనిపిస్తోందా?
ఈ 58 నెలల్లో చేసిన పనులు చెప్పాను. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీ నెరవేర్చలేదు. కనీసం ప్రత్యేక హోదా కూడా తేలేదు. ఇలాంటి వ్యక్తిని నమ్మాలా? మళ్లీ ఇదే ముగ్గురు ఇవాళ సూపర్ సిక్స్ అంటున్నారు. కొత్త మోసాలు, కొత్త అబద్ధాలతో వస్తున్నారు. వీళ్ల మోసాలకు, అబద్ధాలకు మనం గట్టిగా బదులివ్వాల్సిన అవసరం ఉంది. వలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్షలేని పాలన జరగాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి.
మన ప్రభుత్వం వచ్చాక రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. కరోనా వల్ల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల అనుకున్న సమయానికి చేయలేకపోయాం. నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు నిండాయి. కాబట్టి రాజోలి ప్రాజెక్టు సంబంధించి ప్రాముఖ్యత ఏమిటి అని మనకు అంత అనిపించలేదు. కానీ ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగా పడడంతో ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత తెలుస్తోంది. వచ్చే టర్మ్‌లో కచ్చితంగా పూర్తి చేస్తాం. మీ ఆశీస్సులు కోరుతున్నా.