నిన్న మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై, ఆ తరువాత టీడీపీతో కలిసి వివేకా కుమార్తె, సునీతా రెడ్డి, తన చెల్లెలు షర్మిల చేస్తున్న ప్రచారం పై నిప్పులు చెరిగారు . హత్య, అనంతర పరిణామాల్లో ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ సూటి ప్రశ్నలు సంధించారు.
సభలో మొదట ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి అంశాల్ని ప్రస్థావించిన జగన్ ఆ తరువాత ఈ అంశం పై మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుకు కుట్రలు, కుతంత్రాలే కాదు.. మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలతో గోబెల్స్ ప్రచారమే కాదు.. కుటుంబాలను చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉందని మీరందరూ చూస్తున్నారు. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు. మా చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో? ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో కూడా మీ అందరికీ రోజూ కనిపిస్తానే ఉందన్నారు.
ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో కూడా మీరంతా రోజూ చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుని మరీ మద్దతిస్తున్నది ఈ చంద్రబాబు, ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తపించిన పోతున్న ఒకరిద్దరు నా వాళ్లు వీరంతాకూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా మద్దతిస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతున్నాను అంటూ తన చెల్లెల్లు సునీత, షర్మిల చంద్రబాబు, కాంగ్రెస్ లతో కలిసి చేస్తున్న రాజకీయాలను ఎండగట్టారు .
చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే దాని అర్థం ఏమిటి? ఇంతటి దారుణం చేస్తూ .. దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయం అని వారికి వారే చెబుతున్నారంటే ఇది కలియుగం కాకపోతే ఇంక ఏమిటి? అంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చుని, ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా? ప్రజల మద్దతు లేని బాబు.. చేస్తున్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాను.
నేను ఆ దేవుడు, ఆ ప్రజలు .. వీళ్లిద్దరినే నమ్ముకున్నాను. ధర్మాన్ని, న్యాయాన్ని వీటి రెండింటినే నేను నమ్ముకున్నాను. ఈరోజున నన్ను, మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వారికి, ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. మనకు వంచించిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు ఈ తేడా గమనించమని అడుగుతున్నానని ఉద్వేగ పూరితంగా చేసిన ప్రసంగంలో వేసిన సూటి ప్రశ్నలకు సునీత, షర్మిల, చంద్రబాబులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.