ఎన్నికలకు ఇంకా కేవలం రెండు వారాల గడువు కూడా లేదు. కాగా ఎన్నికల సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనంతరం రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే..
బొబ్బిలి సిద్ధమేనా..? ఇంతటి ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులతో.. ఏమాత్రం ఎండను ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వుల మధ్య ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే సందర్భంగా మీ అందరితో కూడా కోరుతున్నది ఒక్కటే. అందరూ ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ గతంలో చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ.. అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోతోంది. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా.. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు అమలు. ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లంచాలు లేని, వివక్ష లేని ఇంటి వద్దకే అందుతున్న పాలన.. చేయి పట్టుకుని నడిపిస్తూ ప్రతి పేదవాడికీ అండగా ఉంటూ వైద్యం.. రైతన్నకు అండగా తనను చేయి పట్టుకుని నడిపిస్తున్న వ్యవసాయం. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా, కంటికి కనపడే విధంగా సామాజిక న్యాయం.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటూ మన కళ్ల ఎదుటే కనిపిస్తూ… ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో ఇవాళ జరుగుతోందని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను. ఇదే సందర్భంగా, ఇదే పరిస్థితుల మధ్య మరో 13 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ప్రతి ఒక్కరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను. ఈ ఓటుతో మీ తలరాతలు మారతాయి. మీ ఇంటింటి భవిష్యత్తు, మీ పథకాలన్నీ కొనసాగింపునకు నిర్ణయించేది ఈ ఎన్నికలు, మీ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.
ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే అన్నతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను. ఈరోజు మీ అందరితో కూడా ఒక్కటే కోరుతున్నాను. ఈ రోజు ఒకపక్క మీ జగన్ ప్రజలు ఏం చేశాడో చెబుతూ.. మీ బిడ్డ మీ బిడ్డ ప్రచారం చేస్తున్నాడు. కానీ మరో వంక చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో మీరంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఇదే పెద్దమనిషి ఏమన్నారో తెలుసా? రేపు జగన్ ను చంపితే ఏం జరుగుతుంది? అని మాట్లాడతాడు ఈ పెద్దమనిషి. ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇతనికి ఇతని మానసిక పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈ చంద్రబాబు ఆలోచన ఏమిటి అని మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను.
ఏమయ్యా చంద్రబాబూ.. ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతున్నాను. నేను అడుగుతున్న ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇదీ అని చెప్పి తాను చెబుతుంటే తన మెంటల్ హెల్త్ ఏ పరిస్థితిలో ఉంది అని ఆలోచన చేయమని కోరుతున్నాను. కుర్చీలు లాక్కోవటం, వెన్నుపోట్లు పొడవడం, మోసాలు చేయడం, కుట్రలు చేయడం, మనుషుల్ని చంపేయడం, ఇదే చంద్రబాబు నైజం, ఇదే చంద్రబాబు రాజకీయం. గతంలోకి ఒక్కసారి వెళ్తే ఎన్టీఆర్ కుర్చీని లాక్కొని మళ్లీ వెనక్కు వచ్చి తన కుర్చీ తాను తీసుకుంటాడేమో అని సొంత మామను, సొంత పార్టీ అధ్యక్షుడిని కుట్రలతో చంపేసింది ఎవరు? అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. వంగవీటి మోహన రంగారావును కుట్రలతో చంపింది ఎవరు? అని అడుగుతున్నాను. పింగళి దశరథరామ్ ను కుట్రలతో చంపింది ఎవరు? ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర రావును కుట్రలతో చంపింది ఎవరు? ఇప్పుడు జగన్ ను చంపేస్తే తప్పేంటి అని అంటున్నది ఎవరు? అని మీ బిడ్డ మీ అందరి సమక్షంలో అడుగుతున్నాడు.
అయ్యా చంద్రబాబూ.. నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ 59 నెలల్లో మంచి జరిగిన ఆ కోట్ల మంది నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు జగన్ కు తోడుగా, జగన్ కు అండగా, ప్రతి ఇంట్లోనూ జగన్ కు తోడుగా, అండగా ఉన్నారయ్యా చంద్రబాబూ. వారే వారి జగన్ ను రక్షించుకుంటారు. నాకు నీ మాదిరిగా జడ్ ప్లస్ లు, జడ్ డబుల్ ప్లస్ లు సెక్యూరిటీ అక్కరల్లేదయ్యా. నేను నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ.. ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా ఇచ్చిన రూ.2.70లక్షల కోట్ల డీబీటీ బటన్ లే నాకు శ్రీరామరక్ష. నేను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన అమ్మఒడి, నేను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన, నాఅక్కచెల్లెమ్మలకు వారి పిల్లలు బాగుండాలని ఆరాటపడుతూ ఇచ్చిన చేయూత, ఆసరా, సున్నావడ్డీ, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు నిర్మాణం ఇవన్నీ నాకు రక్షణ అని చంద్రబాబుకు చెబుతున్నాను.
నా అవ్వాతాతలకు మంచి చేస్తూ వారి ఇంటికే తెచ్చి ఇచ్చిన పెన్షన్ ద్వారా నా అవ్వాతాతలు దేవుడికి చేస్తున్న ప్రార్థనలే నాకు శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. నేను నా..నా..నా.. అని పిలుచుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సామాజిక వర్గాలు, వారి చేతులు కలిపి చేస్తున్న ప్రార్థనలే వారి బిడ్డకు వారి జగన్ కు శ్రీరామ రక్ష అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి బిడ్డ వారికి చేసిన మంచిని అందుకున్న నా రైతన్నలు, వారి పొలాల్లో ఆ భూమాత సాక్షిగా, ఆ పంచ భూతాల సాక్షిగా చేసే చిన్న ప్రార్థనే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని తెలియజేస్తున్నాను.
చంద్రబాబూ జీవితంలో ఏ రోజూ మంచి చేయని మనిషి నువ్వుఅయ్యా చంద్రబాబూ.. నువ్వు ఏరోజూ నీ జీవితంలో మంచి చేయలేదు. ఇదే సందర్భంగా నాకు నువ్వు అన్న మాటలు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి.
ఆరోజు నా తండ్రి, ఆ మహానేత ఆ దివంగత నేత, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు, వైయస్సార్ గారు చేస్తున్న మంచి పనులు, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్కసుతో అసెంబ్లీ సాక్షిగా నాన్న చనిపోక ముందు నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావు అన్న నీ మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను చంద్రబాబూ అని ఈ సందర్భంగా చెబుతున్నాను. నాడు నా తండ్రిని, నేడు నన్ను ప్రజా క్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ దిగజారుడు తనానికి, నీ నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి అని ఈ సందర్భంగా చెబుతున్నాను.
ఇదే చంద్రబాబును అడుగుతున్నాను. నువ్వు జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు. మరి నీ పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఫలాని మంచి చేశావు అని ఒక్కటంటే ఒక్కటైనా ఏ పేదవాడికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబూ అని అడుగుతున్నాను. అయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రి అంటావు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను అంటావు. మరి నీ పేరు చెబితే ఏ పేదకైనా నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబూ? ఈ పెద్దమనిషి చంద్రబాబు తన జీవిత కాలంలో ఏ రోజూ కూడా పేదలకు మంచి చేసిన పరిస్థితులు లేవు. ఏరోజూ మంచి చేశానని చెప్పుకునే కనీసం ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈ చంద్రబాబుది. ఇదే చంద్రబాబు గురించి మీ అందరినీ కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. 14 ఏళ్లు ఆయనను అధికారంలో చూశారు. 3 సార్లు ఆయనను ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు. మీకోసం, పేదవాళ్ల కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్దమనిషి ఈరోజు మళ్లీ ఏం చెబుతున్నాడు. ఈరోజు మళ్లీ కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త అబద్ధాలతో మళ్లీ మేనిఫెస్టో అంటూ ప్రజల్ని మోసం చేసేందుకు మళ్లీ ఈ పెద్దమనిషి బయల్దేరాడు.
ఇదే సందర్భంగా నేను అడుగుతున్నాను. అయ్యా బాబూ.. నీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా? ఇదే చంద్రబాబును అడుగుతూ.. ఇది మీ అందరికీ చూపిస్తున్నాను. ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా (టీడీపీ మేనిఫెస్టోను చూపుతూ) 2014లో ఇదే ముగ్గురి ఫొటోలతో, ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినవి ఒక్కటైనా జరిగిందా? లేదా? అన్నది మిమ్మల్నే అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి.
2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు అప్పట్లో ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించాడు. ఇందులో ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు ఏమిటి అంటే రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రైతుల రుణ మాఫీ జరిగిందా? ముఖ్యమైన హామీల్లో ఈ పెద్దమనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతున్నాను. వేల మంది ఇక్కడ ఉన్నారు. ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్కచెల్లెమ్మలకు మాఫీ అయ్యిందా? ఏకంగా రూ.14,205 కోట్లు ఎగనామం పెట్టాడు ఈ పెద్దమనిషి.
ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తానని చెప్పాడు ఈ పెద్దమనిషి. నేను అడుగుతున్నా. మీలో ఎవరికైనా ఒక్క రూపాయి అయినా వేశాడా? ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగభృతి నెల నెలా అన్నాడు. మీలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్క ఇంటికైనా 60 నెలల్లో రూ.2 వేలు చొప్పున రూ.1.20 లక్షలు ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను మీ అందరినీ అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటైనా స్థలం ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? బొబ్బిలిలో కనిపిస్తోందా? మీ అందరితో కూడా అడుగుతున్నాను. ముఖ్యమైన హామీలంటూ 2014లో చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో, ఆయన స్వయంగా సంతకం పెట్టి పంపిన ఈ పాంప్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. ఇలాంటి వ్యక్తులను నమ్మగలమా? అని మీ అందరితో అడుగుతున్నాను.
ఇప్పుడు మళ్లీ వీళ్లు ముగ్గురే ఇదే ముగ్గురే మళ్లీ మోసం చేసేందుకు ఏమంటున్నారు. సూపర్ సిక్స్ అంటున్నారు. నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. నమ్ముతారా? నమ్ముతారా అక్కా, నమ్ముతారా తమ్ముడూ. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? మీ అందరూ ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి అబద్ధాలు, మోసాలతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతూ.. వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేద వాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు. సిద్ధమేనా..
మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాను. తమ్మడూ మన గుర్తు ఫ్యాను, అక్కా మన గుర్తు ఫ్యాను. అవ్వా ఇక్కడ.. మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి.
ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మన అభ్యర్ధులపై ఉంచి, దీవించాలని సవినయంగా మీ అందరితో కోరుతున్నాను.
నాకు తండ్రి లాంటి వాడు చిన్న అప్పలనాయుడు అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాడు నిలబడుతున్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కోరుతున్నా. చిన్న అప్పలనాయుడు అన్న మీలో ఒకడు అన్నది ఎవరై మర్చిపోవద్దండి. తాను గెలిచాడు అంటే దాని అర్థం.. ఒక పేదవాడు, ఒక బీసీ గెలిచాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.
ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలకు, 25కు 25 ఎంపీ స్థానాలు.. రెండూ కలిపితే 200 స్థానాలకు మొట్ట మొదటి సారిగా దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో చూడని విధంగా 200 స్థానాలకు ఏకంగా 100 స్థానాలు ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ తరఫున నిలబడుతున్నారంటే సామాజిక న్యాయం అన్నది ఏ స్థాయిలోకి మీ బిడ్డ తీసుకుని పోయాడో ఒక్కసారి గమనించమని కోరుతూ ఈ సామాజిక న్యాయానికి మీరందరూ కూడా రక్షకులుగా నిలబడండి అని మీ అందరినీ పిలుపునిస్తున్నాను. తోడుగా ఉండమని మీ అందరినీ కోరుతున్నానని తెలియజేస్తూ సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.