సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి అంశంలో స్పష్టంగా ఉంటారు. తను అనుకుంది కుండబద్ధలు కొట్టడం ఆయన నైజం. డొంకతిరుగుడు సమాధానం ఉండదు. గతంలో ఒకలా.. ఇప్పుడు ఒకలా మాట్లాడరు. రాష్ట్రాభివృద్ధి విషయంలో, పేదలకు మంచి చేసే విషయంలో ఆయన విజన్‌ను ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటుంటారు. ఎన్నికల నేపథ్యంలో జగన్‌ను ఇండియాటుడే టీవీ ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా చాలా అంశాలపై సీఎం మరోసారి తన పార్టీ వైఖరి ఏంటో స్పష్టత ఇచ్చారు.
రాజ్దీ విశాఖ రాజధాని గురించి ప్రస్తావించగా సీఎం ఇలా అన్నారు. ‘అమరావతి గురించి మాట్లాడే వారు రూ.లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారో చెప్పగలరా?, గతంలో చంద్రబాబు ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. అమరావతి కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం మొదలు పెడితే పది, పదిహను సంవత్సరాల్లో అది పది లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. రాజధాని కలగానే మిగులుతుంది. విశాఖ ఏపీలో నంబర్ వన్ నగరం. రాబోయే ఐదు నుంచి పదేళ్లలో రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు విచ్చిస్తే దేశంలోని చాలా నగరాలతో పోటీ పడుతుంది’
కేంద్రంలో అధికారం కోసం నరేంద్రమోదీకి సీట్లు తగ్గితే మీరు 20 మంది ఎంపీలతో సపోర్టు చేస్తారా అని ప్రశ్నించగా జగన్ చాలా సూటిగా సమాధానమిచ్చారు. ఊహాజనిత పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడడం. ఇప్పుడు వారు, నేను వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. షర్మిల మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది మీ ప్రతిష్టకు భంగంగా భావిస్తున్నారా అని రాజ్‌దీప్ అడిగారు. దీనికి ‘ఆమె డిపాజిట్ కోల్పోతుంది. ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఏ పార్టీ అయితే నా తండ్రి పేరు చార్జ్‌షీట్‌లో చేర్చిందో.. కల్పిత కేసులతో నన్ను ఇబ్బంది పెట్టిందో.. దాని గురించి ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు నా సోదరిని రేవంత్ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారు. కాంగ్రెస్ రిమోట్ ఆయన చేతిలో ఉంది. నేను వారితో, బీజేపీతో ఫైట్ చేస్తున్నాను’ అన్నారు.
ఎన్నికల అనంతరం ప్రధానితో మీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పారని అడగ్గా జగన్ ‘ప్రస్తుతం చంద్రబాబు, మోదీ పొత్తులో ఉన్నారు. వారు పొత్తు పెట్టుకుంటే అభివృద్ధి కోసమా.. అదే ఒక రాష్ట్ర సీఎం కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఇంకోదాని కోసమా?’ అన్నారు.