‘తొలి పింఛన్ రూ.7 వేలు. ఏప్రిల్ నుంచే రూ.4 వేల చొప్పున పింఛన్ ఇస్తాను. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మీరు తీసుకునే రూ.మూడు వేలకు అదనంగా వెయ్యి చొప్పున వేసి జూలైలో ఇచ్చే పెన్షన్‌తో కలిపి మీ ఇంటికే పంపిస్తాను’ ఇటీవల ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.
వలంటీర్లు పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించాక బాబుపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఇంటి వద్దే డబ్బు అందుకున్న వృద్ధులు, దివ్యాంగులు ఆయనపై తిట్ల దండకం అందుకున్నారు. దీంతో భయపడిపోయిన 40 ఇయర్స్ ఇండస్ట్రి కొత్త నాటకానికి తెరతీశారు. అదే పింఛన్ల పెంపు.. ఒక్కసారిగా అందించడం. తనపై కోపంగా ఉన్న లబ్ధిదారులను మచ్చిక చేసుకునేందుకు, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తొలి పింఛన్ రూ.7 వేలని ఊదరగొడుతున్నారు.
ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంపు చేస్తామని చెప్పడం వరకు బాగుంది. కానీ రాక ముందు మూడునెలలది కలిపి జూలైలో ఇస్తామనడాన్ని చూస్తే.. ప్రలోభ పెట్టేందుకే ఇలా మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. నిజంగా బాబులో మాటలు నమ్మొచ్చా అనుకుంటే.. చరిత్రలో ఆయన మోసం చేసిన ఘటనలే అధికంగా ఉన్నాయి. నారా వారి హామీ ఎన్నికల్లో లబ్ధి కోసమేనని అర్థమవుతోంది. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత ప్రభుత్వం రూ.4 వేలు ఇవ్వకుండా అన్యాయం చేసిందని కదా చెప్పాలి. ఆ 60 నెలలకు సంబంధించిన సొమ్ము కూడా ఇస్తానని ప్రకటించాలి కదా. కానీ అలా చేయకుండా 57 నెలలను పక్కన పెట్టేసి కేవలం ఏప్రిల్, మే, జూన్ నెలలవి మాత్రమే కలిపి ఇస్తాననడం ప్రజలను మోసం చేసేందుకే అని తెలుస్తోంది.
అబద్ధాలు చెప్పడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏదైనా అంశంలో తనపై ఆగ్రహం వ్యక్తమైతే వెంటనే నోటికొచ్చిన హామీ ఇచ్చేస్తారు. ఆ తర్వాత నేనెప్పుడు అన్నానంటారు. టీడీపీ ప్రభుత్వంలో కొత్త పింఛన్ల మంజూరుకు జన్మభూమి కమిటీలు ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో అందరికీ ఇంకా గుర్తుంది. డబ్బు అందుకునేందుకు దివ్యాంగులు, వృద్ధులు ఎలా అవస్థలు పడ్డారో ఇంకా జనం కళ్లముందు మెదులుతోంది. అడ్డమైన నిబంధనలు పెట్టేసి లక్షల్లో పింఛన్లు కత్తించిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేదు. ఎన్నికల సమయంలో 66 లక్షల మంది పెన్షనర్ల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఈ టీడీపీ అధినేత. ఇప్పుడొచ్చి 4 వేల రూపాయలు ఇంటికి పంపేస్తా.. మూడునెలలది కలిపి ఒకేసారి రూ.7 వేలు ఇస్తానంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. పోలింగ్ లోపు ఈ మాయగాడు ఇంకెన్ని చెబుతాడో..