‘దగ్గుబాటి పురందేశ్వరి నా భార్య సోదరి కదా.. తెలుగుదేశానికి మంచి చేస్తుందిలేనని పూర్తిగా నమ్మాను. ఇప్పుడు పూర్తిగా మునిగిపోయాం’ రెండు రోజుల క్రితం తనను కలిసిన సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. మొన్నటి వరకు పొత్తు కుదర్చాలని బతిమిలాడుకున్న బాబు ఇప్పుడు ఆమె పేరు ఎత్తితేనే కోప్పడుతున్నాడని సమాచారం.
కమలం పెద్దలు చంద్రబాబు గ్యాంగ్‌కు హ్యాండ్ ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ నెల మధ్యలో ఉమ్మడి సభకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చి మొక్కుబడి మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలు ఏడెనిమిది ప్రజాగళం సభలు నిర్వహిస్తారని, అందులో ముడింటికి ప్రధాని హాజరవుతారని ఎల్లో మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇంత వరకు ఆ ఊసే లేదు. దీంతో బాబు, పవన్ కళ్యాణ్‌కు దిక్కుతోచడం లేదు.
పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోందని, సభలు పెట్టాలని బాబు కోరుతున్నా కాషాయ పార్టీ పెద్దలు ఒక చెవిలో నుంచి విని పక్క చెవిలోంచి వదిలేస్తున్నారట. బాబు నేషనల్ మీడియాను అడుక్కుని ఇంటర్వ్యూలు పెట్టించుకుని మోదీని పొగిడినా పట్టించుకోవడం లేదని సమాచారం. 2014లో మోదీ పూర్తి సహకారం అందించారు. కానీ ఈసారి మాత్రం తనకేం పట్టనట్లు ఉన్నారు. ఇటీవల సభలకు ప్రధాని వస్తారంటా షెడ్యూల్ విడుదలైంది. కానీ వెంటనే క్యాన్సిలైంది. మరోసారి చేస్తారని ప్రకటనలు వచ్చాయి. అమిత్‌షా, జేపీ నడ్డా, ఇతర పెద్దలు కూడా ఇంత వరకు ఏపీలో ప్రచారానికి రాలేదు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందరూ విస్తృతంగా తిరుగుతున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై చంద్రబాబు ఒత్తిడి పెంచారు. ఆమె అధిష్టానంతో పలుమార్లు మాట్లాడినా కనీసం స్పందన కూడా లేదట. సీట్లు తక్కువగా తీసుకోవడం, అది కూడా డబ్బులకు విక్రయించడం తదితర ఆరోపణలతో ఆమెపై నమ్మకం పోయిందని చెబుతున్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ కూడా ప్రయత్నిస్తున్నా మోదీ గ్యాంగ్ చంద్రబాబును నమ్మడం లేదని తెలుస్తోంది. అందుకే సభల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని, వారి నుంచి సహకారం అందడం లేదని బాబుకు రెండు రోజుల క్రితం సీనియర్ నాయకులు చెప్పగా ఆయన పురందేశ్వరి తీరు బాగోలేదని చెప్పారట. ఆమె చెప్పిన వారికే టికెట్లు ఇచ్చినా కమలం పెద్దల్ని ఒప్పించలేకపోయారని అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఇప్పుడు నిండా మునిగిపోయామని, ఏదో ఒకటి చేసి మోదీ, అమిత్‌షాను పిలిపించి ప్రచారం చేయించుకోకపోతే తీవ్ర నష్టం వాట్లితుందని బాబు చెప్పారట. పురందేశ్వరిని పక్కన పెట్టేసి వెంకయ్య నాయుడు తదితరుల ద్వారా ప్రయత్నిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారని సీనియర్ల నుంచి అందుతున్న సమాచారం.