‘స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వలంటీర్ల జీవితం మారుస్తాం. వారు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా చేస్తాం’ కుప్పం పర్యటనలో మంగళవారం యువతతో జరిగిన సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మాటలివి. ఆయన నోటి వెంట మళ్లీ స్కిల్ డెవలప్మెంట్ అనే పదం విని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడిపోతున్నారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాలు గుర్తొచ్చాయి కాబోలు..
శ్రీకాళహస్తి తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి వలంటీర్లను జిహాదీ టెరరిస్టులతో పోల్చాడు. దీంతో అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే వలంటీర్లు తమతో లేరని ఆందోళనలో ఉన్న టీడీపీ అధిష్టానం కవర్ చేసేందుకు రంగంలోకి దిగింది. నాలుగున్నరేళ్లకు పైగా సేవా సైన్యంపై పడి ఏడ్చిన చంద్రబాబు కొద్దిరోజులుగా వారిపై కపట ప్రేమ చూపిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అనేక హామీలిస్తున్నారు. కానీ ఆయన్ను నమ్మేది లేదని వలంటీర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలు మరింత డ్యామేజ్ చేయడంతో బాబు కొత్త పాట అందుకున్నారు.
నాడు గోనె సంచులు మోసే ఉద్యోగమని వెక్కిరించి నేడు వారి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే దాని పేరుతో గతంలో బాబు అవినీతికి పాల్పడిన విషయం అందరికీ మరోసారి గుర్తొస్తోంది. ఆ స్కాంను చూస్తే.. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా దాని పేరుతో చంద్రబాబు బృందం ఓ ప్రాజెక్టును సృష్టించి రూ.241 కోట్లు కొట్టేసింది. ఈ కేసుపై ఈడీ కొరడా ఝుళిపించింది. షెల్ కంపెనీల ప్రతినిధులను అరెస్ట్ చేయడంతోపాటు డిజైన్ టెక్ అనే కంపెనీ బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసింది. ఇక సిట్ షెల్ కంపెనీ ప్రతినిధులు, అప్పటి అధికారులను అరెస్ట్ చేసింది. గతేడాది చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 50 రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. తొలుత అనారోగ్య కారణాలను సాకుగా చూపించి హైకోర్టు నుంచి మధ్యంత బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది.
మళ్లీ దీనిని ఎందుకు తెరపైకి తెచ్చారని తెలుగు తమ్ముళ్లు లోలోన మదనపడుతున్నారు. అసలు బాబు అరెస్ట్ అయ్యినప్పుడు కవర్ చేయలేక నానా తంటాలు పడ్డామని వాపోతున్నారు. అధికారంలోకి రావడానికి బాబు నోటికొచ్చింది చెప్పేస్తున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. వలంటీర్లు రెండు లక్షల మందికి పైగా ఉన్నారు. ఎన్నికల్లో వారి ఓట్లు చాలా కీలకం. గతంలో అనేకసార్లు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వారిని చుకలనగా మాట్లాడారు. దీంతో ఓట్లు వేయరనే భయం కూటమి నేతలను వెంటాడుతోంది. అందుకే ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఒకవేళ నారా వారు∙అధికారంలోకి వస్తే వలంటీర్లకు మంచి చేయరు. ఇంకా ఇలా స్కిల్ డెవలప్మెంట్ అంటూ రూ.కోట్లు కొట్టేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి స్కాం చేసిన అనుభవం ఉంది కదా. కాకపోతే చట్టానికి దొరక్కుండా చేయాలని చూస్తారు.