‘టీడీపీ సూపర్ సిక్స్‌తో భవిష్యత్తు గ్యారెంటీ. అందుకు నేను ష్యూరిటీ మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ నీరు, బీసీలకు రక్షణ చట్టాలు, పూర్ టు రిచ్’ ఎన్నికల రోడ్‌షోలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతూ పోతున్నాడు. మేము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తా.. యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తా.. ఈలోగా నిరుద్యోగ భృతి ఇస్తా.. మద్యం ధరలు తగ్గిస్తా.. రైతులకు పెట్టుబడి నిధులిస్తా.. పెన్షన్ ఇంటికే తెచ్చిస్తా..’ ఇలా నోటికొచ్చింది అనేస్తున్నాడు. ఆ సన్నటి వీధిలో ఓ అంగడి లోపల టీ తాగుతూ వింటున్న ఇద్దరు వెంటనే ఒకేసారి ‘ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కదా.. చంద్రబాబు జనాన్ని బానే ఫూల్స్ చేస్తున్నాడు’ అన్నారు. నిజమే.. 40 ఇయర్స్ ఇండస్ట్రికి ఇది వెన్నతో పెట్టిన విద్య.
2014 మేనిఫెస్టోలో 600కు పైగా హామీలిచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నారా వారిది. అందులో ప్రధానంగా పొదుపు, రైతు రుణాల మాఫీ. అన్నదాతలకు అనేక కొర్రీలు పెట్టి అరకొరగా నిధులిచ్చి మమ అనిపించాడు. ఇక 2019 ఎన్నికలకు కాస్త ముందు పసుపు – కుంకుమ అంటూ హడావుడి చేశాడు. అలా మహిళల, రైతులను ఫూల్స్ చేశాడు. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఊరికొకటి కూడా ఇవ్వలేదు. ఆనాడు కూడా నిరుద్యోగ భృతి అన్నాడు. దానిని కూడా ఎన్నికలకు ముందు అరకొరగా ఇచ్చి యువతను ఫూల్స్ చేశాడు. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో జన్మభూమి కమిటీలు పెట్టిన ఇబ్బందులైతే చెప్పనక్కర్లేదు. ఇక లబ్ధిదారులు ప్రతినెలా పింఛన్లు తీసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఇప్పుడు ఇంటికే పంపిస్తానంటూ మరోసారి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలను ఫూల్స్ చేయాలని చూస్తున్నాడు.
అమరావతి పేరుతో భూ కుంభకోణం చేసి.. గొప్ప రాజధాని కట్టేస్తున్నానంటూ గ్రాఫిక్స్ చూపించి రాష్ట్రం మొత్తాన్ని ఏకకాలంగా ఫూల్స్ చేశాడు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీకి ఓకే అన్నాడు. మళ్లీ హోదా కోసం పోరాటమంటూ ఫూల్స్ చేశాడు. తన స్వార్థం కోసం ఎన్డీఏ నుంచి బయటికొచ్చి నరేంద్రమోదీని నానా మాటలన్నాడు. ఇప్పుడు రాష్ట్ర కోసమంటూ ఎన్డీఏలో చేరి ఫూల్స్‌ను చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే లేటెస్ట్గా నారా వారు జనసైనికులను ఫూల్స్ చేసిన విధానం చూసి ఔరా అనాల్సిందే. వారికి తక్కువ సీట్లు ఇచ్చి.. పవన్ కళ్యాణ్ చేతే నాకివి చాలని అనిపించడం హైలెట్. పురందేశ్వరి ద్వారా బీజేపీని తొక్కేస్తూ ఆ పార్టీ సీనియర్లను ఫూల్స్ చేస్తున్నాడు.
ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని బాబు ప్రజలను ఫూల్స్ చేయని రోజంటూ లేదు. అభివృద్ధి, సంక్షేమం కాగితాలపైనే ఉంటుంది. కానీ అంతా చేసేశానని దబాయిస్తాడు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని నమ్మితే అందరం సూపర్ ఫూల్స్ అవడం ఖాయం.