‘నేను నిప్పుని.. మచ్చ లేకుండా బతికా.. నా అంత నిజయతీపరుడు లేడు’ అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. చేసే పనులు చూస్తే అమ్మ బాబూ అనాల్సిందే.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాటి సీఎం నారా వారిని ప్రధాన నిందితుడిగా, అప్పటి కార్మిక శాఖ మంత్రి, ప్రస్తుత టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడిని రెండో నిందితుడిగా చేరుస్తూ సీఐడీ గురువారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో దర్యాప్తునకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచింది.
చార్జ్‌షీట్‌లో సీఐడీ ప్రస్తావించిన పలు విషయాలను చూస్తే.. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే దాని పేరుతో స్థానికంగా ఉన్న వారితో ఒప్పందాన్ని చేసి ప్రజాధనాన్ని లూటీ చేయాలని చూశారు. రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్టును రూ.3,300 కోట్లదిగా కనికట్టు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న దాని ప్రకారం సదరు కంపెనీ వాటా 90 శాతంలో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా ప్రభుత్వం వాటా నిధులు జీఎస్టీతో సహా రూ.371 కోట్లు చెల్లించారు. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారు.
2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారమిచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏసీబీని విచారణ చేయనీయకుండా అడ్డుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వేసిన సిట్‌తో ఈ బాగోతం మొత్తం వెలుగు చూసింది. సిట్ అధికారులు ప్రధాన సీమెన్స్ కంపెనీని సంప్రదించగా ఈ ప్రాజెక్టు గురించి తెలియదని చెప్పింది. డిజైన్‌టెక్, ఇతర షెల్ కంపెనీల పేరుతో సాగించిన ఈ తతంగాన్ని అధికారులు పూర్తిగా బయటపెట్టారు. చార్జ్‌షీట్‌లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ గంటా సుబ్బారావు, ఏ4గా అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ కె.లక్ష్మీనారాయణ, ఏ5గా సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర కంపెనీల అధికారులను పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బాబు సుప్రీం కోర్టులో వేసి క్వాష్ పిటిషన్‌ను న్యాయమూర్తులు తిరస్కరించారు. ఇంకా బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.
స్కిల్ స్కాంకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. ఈ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. కానీ ప్రజలను పక్కదారి పట్టించడానికి ఎల్లో మీడియా ద్వారా పిచ్చిపిచ్చి పనులు చేశారు. ఇప్పుడు సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌కు ఎన్ని వక్రభాష్యాలు చెబుతారో..