బీసీలపై కత్తి దూసి.. బీసీలకు వైఎస్ జగన్ అన్యాయం చేశారు.. కక్ష కట్టి కుల వృత్తులకు పాతరేసారంటూ ఈనాడు కథనాలు ప్రచురిస్తుంది. వెనుకబడిన వర్గాల వెన్ను విరిచారంటూ ప్రాసతో అబద్ధాలను అందంగా పేర్చి వార్తలు రాస్తుంది.
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని ప్రతి నిత్యం చెబుతున్న వైఎస్ జగన్.. ఆ మాటలు నిజం చేస్తూ బీసీలను బ్యాక్ బోన్ క్లాస్ గా నిలబెట్టేందుకే ప్రతి చోట వారికి తగిన స్థానం కల్పిస్తూ వచ్చారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఇస్త్రీ పెట్టెలు, కత్తెర పెట్టెలు తాయిలాలుగా ఇస్తే… బీసీల ఆత్మబంధువు వైఎస్ జగన్ మాత్రం అన్ని రంగాల్లో బీసీలను ఉన్నత స్థాయికి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. సీఎం జగన్ తొలి కేబినెట్లో 14 మంది బీసీలకు, కొత్త కేబినెట్లో 10 మంది బీసీలకు స్థానం కల్పించారు.
కత్తెరవాటం బాగా తెలిసినవాడు జగన్ అంటూ కార్టూన్ వేయించిన రామోజీకి చంద్రబాబును నెత్తినెట్టుకొని ఊరేగడం తప్ప మరొకపని చేతకాదనుకుంట. అందుకే గతంలో చంద్రబాబు నాయీ బ్రాహ్మణుల నాలుకలు కత్తిరిస్తానంటే వార్తలు రాయకుండా.. ఈరోజు వైఎస్ జగన్ బీసీలతో కలిసి నడుస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతుంటే మాత్రం అడ్డగోలు రాతలు రాస్తున్నాడు.
ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి అడుగులోనూ, ప్రతి పథకంలోనూ బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అడుగులు వేశారు.. బీసీ కులాల్లో పేదమహిళలకు అండగా ఉండి వారి ఆర్ధిక ప్రగతికి చేయూత నిచ్చేందుకు వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలు.. వారి పిల్లలను చదివించేందుకు అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన.. రైతులకు రైతు భరోసా, సున్నా వడ్డీలు, పంట నష్టపోతే పరిహారం.. అంటూ అన్ని రకాలుగా బీసీల ప్రగతికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ పథకం అమలుచేస్తున్నా అందులో బీసీ కులాల లబ్ధిదారులు అధిక సంఖ్యలో లబ్ధిపొందుతుంటారు.
కక్ష కట్టి కుల వృత్తులకు పాతరేసారంటూ రాసుకొచ్చిన రామోజీ రాతలు అబద్ధమని చెప్పడానికి రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చిన జగనన్న చేదోడు పథకమే నిదర్శనం.. పేదలకు అండగా ఉండేందుకు అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుట్టుక నుండి విద్య వైద్యం దాక అన్నిట్లో ప్రజలకు తోడుగా ఉంటుంది.
తిరుపతిలో సన్నిధి గొల్లకు తరాలుగా వస్తున్న వారసత్వ హక్కును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది.. యాదవులకు తిరుపతిలో సన్నధి యాదవ్ అనే సముచిత స్థానాన్ని కల్పించారు వైఎస్ జగన్.. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ కులాలకు వైఎస్ జగన్ చేసినవి అనేకం..
కానీ అవేవి ఈనాడుకి కానీ ఇతర ఎల్లో మీడియాకి కానీ కానరావు.