రాజమహేంద్రవరం రూరల్ సీటు తనకే కావాలని డిమాండ్ చేస్తున్న సిటింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి స్వరంలో తేడా వచ్చింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మంత్రి వేణు పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా జనసేన నుంచి బరిలో ఉండాలని జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఉవ్విళ్లూరుతున్నారు. కొంతకాలంగా బుచ్చయ్య, దుర్గేష్‌ల మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. ప్రెస్మీట్లు పెట్టి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. వీరి విషయం అటు తెలుగుదేశం, ఇటు జనసేన పెద్దలకు తలనొప్పిగా మారింది. పార్టీలో అత్యంత సీనియర్ అయిన తనకే టికెట్ ఇవ్వాలని బుచ్చయ్య అడుగుతున్నారు. అప్పుడప్పుడు సొంత పార్టీని సైతం విమర్శించే ఈయనకు మరోసారి అవకావం కల్పించడం చంద్రబాబుకు సైతం ఇష్టం లేదని పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో వయసు రీత్యా పోటీకి దూరంగా ఉండాలని దూతల ద్వారా బుచ్చయ్యతో రాయబారం నడిపినట్లు తెలిసింది.
గోరంట్లను ఎలా ప్రలోభపెట్టారో గానీ తాజాగా ఆయన వాయిస్ మారింది. టికెట్ విషయంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యమని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అలాగే జనసేనకు క్యాడర్ లేదని చురకలు అంటించారు. ఆ పార్టీ ఇంకా బలపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా బీజేపీపై కూడా మాట్లాడారు. గతంలో వారికి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని.. మరోవైపు 175 స్థానాల్లో టీడీపీనే అధికంగా త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనిని బట్టి అధికారం కోసం చంద్రబాబు అందరిని బుజ్జగించారని, బీజేపీ ఎక్కువ సీట్ల డిమాండ్‌కు తలొగ్గారని అర్థమవుతోంది. అయితే గోరంట్లకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. సేనకు ఇస్తే ఓడిపోతామని చెబుతోంది. మొత్తానికి బుచయ్య సైలెంట్ అయ్యారా.. లేక నటిస్తున్నారా.. అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..