విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వారి నిర్ణయం చెప్పాలి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరూ చూపు విశాఖపై ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గాగా చేస్తామని గతంలోనే ప్రకటించింది. ఆచరణకు మరికాస్త సమయం పట్టేలా ఉంది. ఈ విషయమై మంత్రి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంలో జాప్యం జరిగింది. ఈసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయచిక్కులన్నీ త్వరగా పరిష్కరించుకుని కార్యకలాపాలు ఇక్కడి నుంచి కొనసాగిస్తాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకం. ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల తర్వాత విశాఖలో మెట్రో కార్యరూపం దాల్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. జగన్ చెప్పిన ఎంత కష్టమైనా జగన్ మాట నిలబెట్టుకుంటారు.
సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలని ఆకాంక్ష ఆయనది. చంద్రబాబు మాత్రం తన కులం వాళ్లు అభివృద్ధి చెందితే చాలనుకునే రకం. బాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మా పార్టీ వ్యతిరేకం. కూటమి అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలి. వారికి చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని బీజేపీ కీలక నేతలతో చెప్పించాలి. 20 ఏళ్ల కాలంలో దేశంలోనే విశాఖ తలమాణికంగా నిలుస్తుంది. దేశంలో ప్రధాన నాగరాలను తలదన్నెలా అభివృద్ధి చెందుతుంది.