ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. జనసేన పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన పోతిన మహేశ్ జనసేనకు రాజీనామా చేశారు. ఇది జనసేన పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. విజయవాడ వెస్ట్ సీటును ఆశించిన పోతిన మహేశ్ కు పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో జనసేన పార్టీ లో నాకున్న పదవి బాధ్యతలకు మరియు క్రియాశీలక సభ్యత్వమునకు రాజీనామా చేయుచున్నాను. ఇప్పటివరకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు కులకు మరియు పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదములు అని మహేశ్ పేర్కొన్నారు.
కాగా గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేసిన పోతిన మహేశ్ కు పొత్తులో భాగంగా సీటు దక్కొచ్చని ప్రచారం జరిగింది. దాదాపు సీటు ఖరారు అయిందన్న దశలో చివరి నిమిషంలో బీజేపీ విజయవాడ వెస్ట్ సీటును తన్నుకుపోయింది. 24 సీట్లకు పొత్తుకు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ మూడు సీట్లను త్యాగం చేసి 21 సీట్లకు తలొగ్గారు. దీంతో విజయవాడ వెస్ట్ సీటు సుజనా చౌదరికి దక్కింది. సుజనా చౌదరి బీజేపీలో ఉన్నా చంద్రబాబు సన్నిహితుడుగానే ముద్రపడ్డారు.
పార్టీకోసం చాలా ఏళ్ళు శ్రమించిన తనకు సీటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన మహేశ్ కొద్దిరోజుల అంతర్మథనం తరువాత పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు కాకుండా టీడీపీ నుండి జనసేనకు వచ్చిన నేతలకే టికెట్లు ఇస్తున్నారనే అపవాదును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తణుకు సీటు నీకే అని విడివాడ రామచంద్ర రావుకు మాట ఇచ్చి అక్కడ టికెట్ టీడీపీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణకు ఇచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన కాకినాడ మాజీ మేయర్ సరోజ, బొలిశెట్టి సత్యనారాయణ, పాఠంశెట్టి సూర్యతేజ వంటి నేతలకు జనసేన అధినేత టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే. తాజాగా పోతిన మహేష్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి గెలుపు అవకాశాలు సన్నగిల్లినట్లేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.