ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో టీడీపీలో నివురుగప్పిన నిప్పులా వున్న బేధాభిప్రాయాలు రోజు రోజుకి బద్దలవుతూనే వున్నాయి. నంద్యాల జిల్లాలో టీడీపీలో నాయకుల మధ్య వున్న గొడవలు నామినేషన్ సంధర్భంగా బయటపడ్డాయి. నంద్యాల ఎంపీ అభ్యర్థి కూటమి తరపున బైరెడ్డి శబరి పోటిలో వున్నారు, తను టీడీపీలో చేరి నంద్యాల ఎంపీ టికెట్ ఖరారు చేసే సందర్భంలో తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి అసెంబ్లీ అభ్యర్థికి 7కోట్లు ఎన్నికల ఖర్చులకు ఇచ్చే విధంగా టీడీపీ పార్టీ పెద్దలు నిర్ణయించారని వార్తలు రావడం తెలిసిందే . అయితే ఇప్పటివరకు టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియకు తన వాటా డబ్బులు ఇవ్వకపోవడంతో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో తన భర్త మద్దూరి భార్గవ్ రామ్ నాయుడుని నంద్యాల ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపారు. దీనితో నంద్యాల జిల్లా టీడీపీలో పెద్ద అలజడి మొదలైంది. మద్దూరి భార్గవ్ రామ్ నాయుడు తరుపున తన లాయర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు.
భూమా నాగిరెడ్డి వారసురాలు అఖిలా ప్రియ వలన టీడీపీ అధినేత చంద్రబాబుకు తలబొప్పి కడుతూనే వుంది. మొన్నటి వరకు నంద్యాల అసెంబ్లీ కూడా కావాలని ప్రతి రోజూ గొడవలు చేస్తూ తన మాటలతో చేష్టలతో రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించింది అఖిల . చంద్రబాబు చివరకు ఆళ్లగడ్డ దాటి నంద్యాల విషయంలో జోక్యం చేసుకోవద్దు అని ఖరాఖండిగా చెప్పడంతో కొన్ని రోజులుగా ఎలాంటి గొడవలు లేకుండా వున్నారు. ఇప్పుడు తమ వాటా డబ్బులు బైరెడ్డి శబరి ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి కాపు ఓటు బ్యాంక్, భూమా అనుచరుల ఓటు బ్యాంకుని పెద్ద ఎత్తున చీల్చి టీడీపీకి నష్టం కలిగిస్తాము అంటూ మళ్ళీ మొదటికి వచ్చారు . మద్దూరి భార్గవ్ రామ్ మీద ఆళ్లగడ్డలో దొర్జన్యాలు, కబ్జాలు , బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టటం లాంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
ఇప్పుడు ఈ పరిస్థితిని పార్టీ పెద్దలు ఎలా దారికి తెస్తారో చూడాలి. బైరెడ్డి శబరి , భూమా అఖిలా ప్రియ మధ్య ఆర్ధిక పరమైన అంశాలను సర్దిచెప్పి నామినేషన్ ఉపసంహరణ గడువు లోపల సయోధ్య కుదర్చకపోతే నంద్యాల ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాల్లో తీవ్ర స్థాయిలో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.