12 రోజులుగా సీఎం వైయస్ జగన్ కొనసాగిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ప్రజలతో మమేకం అవుతున్న సీఎం జగన్ యాత్రకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతుండగా ప్రజల సాధక బాధలను జగన్ తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
ఈరోజు ఇక్కడ ఈ జనసముద్రాన్ని చూస్తుంటే మళ్లీ కోటప్పకొండ తిరునాళ్లు నెలరోజుల్లోనే పట్టపగలే కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికీ వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, లంచాలు, వివక్ష లేని పాలనను, ఆ దుష్ట కూటమి, ఆ ఎల్లో మీడియా.. వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే… పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రం అయ్యింది. సిద్ధం.. సిద్ధం అంటూ.. మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలా వినిపిస్తుంటే… అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకూ చేయని పెత్తందార్ల గుండెల్లో మాత్రం మీరు చేస్తున్న సిద్ధం సిద్ధం అన్న నినాదం.. యుద్ధం యుద్ధం అని ప్రతిధ్వనిస్తోంది వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ. పేద వాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను, వారి మోసాలను, అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా.. సిద్ధమేనా?
మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో.. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు అందుతున్న భరోసా, పేద సామాజికవర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మీ ఓటు వల్ల మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? .. లేక మోసపోయి అంధకారంలోకి వెళ్లాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు.. ఈ ఎన్నికలు. జగన్ కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి కూడా కొనసాగింపబడుతుంది. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి. ప్రజలందరూ కూడా, పేదలందరూ కూడా మోసపోతారు. చంద్రబాబు అంటే ఆయన గుణగణాలు ఎలా ఉంటాయంటే.. ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలకా.. అంటూ పేదల రక్తాన్నిమాత్రమే తాగే చంద్రముఖి.
బాబుగారి గురించి ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో కలిసి నేను కొన్ని నిజానిజాలు తేల్చదల్చుకున్నాను. ఈ చంద్రబాబు గురించి ఎల్లో మీడియా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. ఈ చెత్త మీడియా చేస్తున్న ప్రచారం ఏమిటి? వాటిలో ఏది నిజం, ఏది అబద్ధం ఒక్క విషయాన్ని మీ ముందు పెట్టి నిజాలు నిగ్గు తేలుద్దామా? వారు చెప్పే అబద్ధాలు, వారు చెప్పే మోసాలన్నీ కూడా ఈరోజు మీ కళ్ల ఎదుట పెట్టి ఇద్దరం కలిసి జాయింట్ గా నిజ నిర్ధారణ చేద్దామా అని అడుగుతున్నాను. ఈ ఎల్లో మీడియా.. అంటే ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరు ఎంత ప్రమాదకారులు అంటే వీళ్లంతా కూడా చంద్రబాబుతో కూడబలుక్కుని వీరంతా ఒక నిర్ణయానికి వస్తారు. వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు. ఆ గాడిదను గుర్రం గుర్రం అంటూ పదే పదే వీళ్లంతా కూడా ఊదరగొడతారు.ఇదీ ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం. ఇలాగే ఈ పచ్చమీడియా ఈ చంద్రబాబు.. వీళ్లు చేస్తున్న కుట్ర రాజకీయాలు, మోసపు రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు గత 30 ఏళ్లుగా వీళ్లంతా చేస్తూ వస్తున్నారు.
ఈరోజు కొన్ని వాస్తవాలు మీ అందరి సమక్షంలో ఈ ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమంలో ఈ విషయాలన్నీ కూడా తేలిపోవాలి. వీళ్లంతా అంటే ఎల్లో మీడియా, చంద్రబాబు భ్రమ కల్పిస్తుంటారు. జాబు రావాలి అంటే బాబు రావాలి అని భ్రమ కల్పిస్తుంటారు. మీ అందరికీ గుర్తుందా? 2014లో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగా చెప్పారు. టీవీల్లో ఎక్కడ చూసినా అడ్వరై్టజ్మెంట్లు్ల ఇవే. జాబు రావాలి అంటే బాబు రావాలనే అడ్వర్టైజ్మెంట్లు. ఇదే కదా వాళ్లు చెప్పినది. మరి ఈరోజు నేను ఇంత పెద్ద సిద్ధం సభలో అడుగుతున్నాను.చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి మీ ఇంట్లో గానీ, మీఇంటి చుట్టుపక్కలగానీ ఎవరికైనా చంద్రబాబు ఆయన హయాంలో గవర్నమెంట్ జాబు ఎవరికైనా వచ్చిందా? అని అడుగుతున్నాను.
మరి మీ జగన్ వచ్చిన తర్వాత.. మీ గ్రామాల్లోనే మీ ఇంటి పక్కనే, మీ చుట్టుపక్కలే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం తీసుకొచ్చి, ఆ సచివాలయాల్లో ఏకంగా 1.35 లక్షల మంది మన పిల్లలు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో కూడా 80 శాతం మంది నేను నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు ఏకంగా ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు.
మన ప్రభుత్వం రానంత వరకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కు పోయినా కూడా అక్కడ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, పరికరాలు, మందులు లేవు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 58 నెలల కాలంలోనే అక్షరాలా 54 వేల పోస్టులు నియమించాడు. ఈరోజు ఆరోగ్య రంగాన్ని మీ బిడ్డ విప్లవాత్మక మార్పులు చేస్తూ అడుగులు ముందుకు వేయిస్తున్నాడు. మొత్తంగా ఈ 58 నెలల్లోనే మీ జగన్ పాలనలోనే ఎప్పుడూ జరగనట్టుగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి దాకా మీ బిడ్డ పాలన రాక ముందు వరకు కూడా మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే గవర్నమెంటులో అక్షరాలా మరో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. కేవలం ఈ 58 నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే గతంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 మధ్య ఆయన 3వ సారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాడు అంటే కేవలం 32 వేల ఉద్యోగాలు నియామకం చేసిన చరిత్ర ఆయనది.
జాబు విషయంలో బాబు ఇస్తున్నది భోగస్ రిపోర్టు. జగన్ ఇస్తున్నది కళ్ల ఎదుటే కనిపిస్తున్న ప్రోగ్రెస్ రిపోర్టు. ఒకవైపు గవర్నమెంట్ లో ఇవి మాత్రమే కాదు మీ బిడ్డ చేసినది. స్వయం ఉపాధి రంగాన్ని మీ బిడ్డ ప్రోత్సహించాడు. మొట్ట మొదటి సారిగా ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ బిడ్డ వాహన మిత్ర, నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ.. ఇవన్నీ కూడా జగనన్న ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతోంది. ఈరోజు కోట్ల మంది తమ కాళ్ల మీద తాము నిలబడగలిగి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టే పరిస్థితిలోకి వచ్చిందని చెప్పడానికి గర్వపడుతున్నాను.
నిర్మాణంలో 4 సీ పోర్టులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 నోడ్స్.
ఒకవైపు ఇవన్నీ చేయడమే కాకుండా.. మరోవైపున రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీ పోర్టులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వ హయాంలోనే ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ కూడా వేగంగా పరుగులెత్తుతున్నాయి. ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా ఈరోజు నిర్మాణంలో వేగంగా జరుగుతున్నాయి. ఎంతటి వేగంగా అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే వరుసగా ప్రతి సంవత్సరం నంబర్ వన్ గా ఉంది అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయమని కోరుతున్నాను.
ఇక రెండో విషయానికి వద్దాం.. వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్టు చూద్దామా? గతంలో ఏమీ చేయని బాబు.. ఇప్పుడు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. ఇదీ వాళ్లు ఎల్లో మీడియా, చంద్రబాబు కొత్తగా చెబుతున్న మాటలు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలన చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలన చేశారు. వ్యవసాయం దండగ అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అంటే అది ఈ చంద్రబాబే. రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు కూడా ఈ చంద్రబాబే. ఈ రైతుల మీద ప్రేమలేని ఈ వ్యక్తే. ఏకంగా రైతులను విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పిన వ్యక్తి. ప్రత్యేక కోర్టులు నెలకొల్పిన వ్యక్తి.. ఇదీ చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ. సరే ఇదంతా గతం.
2014 నుంచి 2019 మధ్యలో.. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న మూడోసారి రైతులకు ఆయన ఏం చెప్పాడు? 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? ఏకంగా రూ.87,612 కోట్లు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. రైతులకు పగటిపూటే 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. ఏ ఒక్కటైనా చేశాడా? పైగా రైతులకు సున్నావడ్డీ ఎగరగొట్టేశాడు. ఇన్ పుట్ సబ్సిడీ సైతం 2017 నుంచి ఎగ్గొట్టేశాడు. కరెంటు విషయంలోనూ బకాయిలే. ధాన్యం సేకరణలోనూ బకాయిలే, రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను సైతం ఇవ్వకుండా బకాయిలే. ఇవి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 మధ్యలో చేసిన ఆయన చరిత్ర.
మరి మీ జగన్ ఏం చేశాడో ఒక్కసారి ఆలోచన చేద్దామా? మీ బిడ్డ తొలిసారి ముఖ్యమంత్రి. కేవలం 58 నెలల పాలనలో మీ బిడ్డ చేశాడు. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, ఎప్పుడూ ఎవరూ ఆలోచన కూడా చేయనట్టుగా రైతన్నకు మొట్టమొదటిసారిగా ఏకంగా ప్రతి ఏటా రూ.13500 ప్రతి రైతన్న చేతిలో పెడుతున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారా అక్షరాలా ప్రతి రైతన్నకూ రూ.67,500 ఇచ్చాం అని గర్వంగా చెబుతున్నాను. మీ బిడ్డ వ్యవసాయానికి పగటిపూటే నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ మీ బిడ్డ వచ్చిన తర్వాతే ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా రూ.1,700 కోట్లు ఫీడర్లపై ఖర్చు చేసి పగటిపూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర చరిత్రలో అది మీ బిడ్డే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
మొట్ట మొదటి సారిగా ఆర్బీకేలు తీసుకొచ్చాం. దళారీలు లేని వ్యవస్థను తీసుకొచ్చాం. ఆర్బీకేల్లోనే ఎప్పుడూ కూడా కనీవినీ ఎరుగని విధంగా ఈరోజు పంట కొనుగోళ్లు జరుగుతున్నాయి. ధాన్యం సేకరణలో ఏకంగా రూ.64 వేల కోట్లు ధాన్యం సేకరణ ఆర్బీకేల ద్వారా చేయించడమే కాకుండా ప్రతి రైతన్నకూ ఎంఎస్పీ కచ్చితంగా రావడమే కాదు, ఎంఎస్పీకి మించి ప్రతి రైతన్నకూ ఎకరాకు కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేలు అదనంగా ఈరోజు రైతన్నకు ఇస్తున్నాం జీఎల్టీ కింద. ఎంఎస్పీ లేని పంటలకు సైతం అక్షరాలా రూ.7,200 కోట్లతో ఆ ధరలు తగ్గిపోయినప్పుడు, ఆ రైతన్నను ఆదుకుంటూ అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. పంట నష్టం జరిగితే మొట్ట మొదటి సారిగా, ఎప్పుడూ జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే పంట నష్టం పరిహారం అనేది అందుతోందంటే అది మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. సున్నా వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు ఎత్తేస్తే మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ సున్నా వడ్డీ పంట రుణాలు చంద్రబాబు కట్టని బకాయిలను సైతం మనం కట్టి మళ్లీసున్నా వడ్డీకే పంట రుణాలు ఇస్తున్న ప్రభుత్వం కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
ఇంతగా ఆ పిల్లల గురించి, చదువుల గురించి పట్టించుకుని, తోడుగా ఉంటూ పిల్లలను బడులకు పంపిస్తే చాలు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి ఇస్తూ, 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ తీసుకొస్తూ, టోఫెల్ తీసుకొస్తూ 6వ తరగతి నుంచే ఆ ప్రతి క్లాస్ రూములోనూ డిజిటల్ బోర్డులతో డిజిటల్ బోధన తీసుకొస్తూ, 8వ తరగతికి వచ్చే సరికే ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు సైతం పెడుతూ, ఇంగ్లీషు మీడియంతో మొదలు సీబీఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం. బడుల రూపురేఖలు మారుస్తూ ఆ బడుల్లో నాడు నేడు, గోరుముద్ద, పిల్లలు స్కూలుకు మొదటి రోజు వచ్చే సరికే ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుకతో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఉంటూ ఆ పిల్లలను పట్టించుకున్న ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా చూశారా? అని అడుగుతున్నాను.
చంద్రబాబు పరిస్థితి ఏమిటంటే.. ఏ మంచీ పేదలకు ఎప్పుడూ చేయని ఈ బాబు.. ఎప్పుడూ మోసాలు చేసే ఈ బాబు.. ఈ మధ్య కాలంలో నిన్ననే అనుకుంటా.. కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటున్నప్పుడు. ఇదే బాబు నిన్ననో మొన్ననో అన్నాడు. మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా.. వాలంటీర్లకు రూ.10 వేలిస్తాడట. చంద్రబాబు అన్నాడు. పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు. అక్కడికైనా సంతోషం. ఇదే చంద్రబాబు.. మొన్నటి దాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు. ఇదే చంద్రబాబు, ఇదే ఆయన కూటమి.. మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటి దాకా ఏమన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడుకు ఉంది. మూటలు మోసే వాళ్లు అన్నాడు. వారి కథ తేలుస్తా అన్నాడు. వారిని వదిలిపెట్టే ప్రస్తే లేదన్నాడు. వారు మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో నాలుగు అడుగులు ముందుకేశాడు. ఆయన దత్తపుత్రుడైతే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తున్నారు అని అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయివేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్ కు అధికార పెగసస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు.
నిన్న వాలంటీర్లకు మేం రూ.10 వేలిస్తాం అని మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే.. ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలి? నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు. ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలి అని అడుగుతున్నాను.
ఈ చంద్రబాబు కు చెబుతున్నా.. ఊసరవెల్లి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు గానీ, చంద్రబాబు నాయుడు మాత్రం ఊసరవెల్లిని దాటిపోయాడు. తాను ఇప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని ప్రకటించాడు. చెబుతున్నా ఇదే చంద్రబాబూ.. అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే. మొట్ట మొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు. మళ్లీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందర్నీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు. వాళ్లు దోచుకునే దాని కోసం ఈ రూ.10 వేలు అదనంగా వాళ్లకు ఇస్తావు. ఇదీ నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది చిన్న పిల్లాడిని అడిగినా కూడా అందరికీ తెలుసు.
ఒక్కసారి మీ అందరికీ గుర్తుందా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 2014లో ఫ్లాష్ బ్యాక్ లోకి పోదాం. చంద్రబాబు ఎలాంటి మోసాలు చేస్తాడనే దాని కోసం 2014 ఫ్లాష్ బ్యాక్ లోకి పోదామా? రెడీయా? 2014లో చంద్రబాబు ఇదే 3 పార్టీలతో కూటమి. ఆ మూడు పార్టీలు ఎవరు గుర్తుందా? ఇదే చంద్రబాబు, ఇదే మోడీ గారు, ఇదే దత్తపుత్రుడు. 2014లో ఇదే ముగ్గురు కలిసి ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికీ ఈ పాంప్లెట్ పంపించాడు. ప్రతి ఇంటికీ పంపిస్తే ప్రజలు నమ్మరు అని ప్రజలు మర్చిపోతారేమో అని టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు హోరెత్తించారు. ఆ ఈనాడులోనూ, ఆంధ్రజ్యోతిలోనూ, టీవీ5 లోనూ టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు అడ్వర్టైజ్మెంట్లు హోరెత్తించాడు. ఈ పాంప్లెట్లలో ఆయన ఏం రాశాడో చెబుదామా?
రైతుల రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. చేశాడా? రూ.87612 కోట్లు మాఫీ అయ్యిందా? ఆయన చెప్పిన రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. రూ.14205 పొదుపు సంఘాల రుణాల్లో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని అడుగుతున్నాను. మూడో ముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 2014లో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టి ఉంటారు కదా.. లేకపోతే మీ పక్క ఇళ్లలో పుట్టారు కదా.. ఏ ఒక్కరికైనా రూ.25 వేలు కథ దేవుడెరుగు.. ఒక్క రూపాయి అయినా వేశాడా? ఇంటింటికీ ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేలు. 60 నెలల్లో రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు ఇచ్చాడా నిరుద్యోగభృతి అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పోదామా.. అర్హులైన వారందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు. 3 సెంట్ల కథ దేవుడెరుగు.. ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పోతే రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అట, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అట.. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా? మన పిడుగురాళ్లలో కనిపిస్తోందా? పోనీ మన గురజాలలో అన్నా కనిపిస్తోందా? మరి నేను అడుగుతున్నాను. మిమ్మల్నే అడుగుతున్నా. ఇదే ముగ్గురు, వాళ్ల ఫొటోలు పెట్టి 2014లో మేనిఫెస్టోలో ఇచ్చి.. ముఖ్యమైన హామీలు అంటూ ప్రత్యేకంగా పాంప్లెట్ కొట్టించి అందులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టించి ప్రతి ఇంటికీ పంపించిన ఇన్ని ముఖ్యమైన హామీల్లో ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని అడుగుతున్నా? ప్రత్యేక హోదా ఇచ్చాడా? అని అడుగుతున్నాను.
మన గుర్తు.. అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా పొరపాటున మర్చిపోయి ఉన్నా, తెలియకపోయి ఉన్నా మన గుర్తు ఫ్యాను. అక్కడ ఉన్న అవ్వలు, అక్కలు, మన గుర్తు ఫ్యాన్ అమ్మా. మన గుర్తు ఫ్యాను. పేదల భవిష్యత్తు కోసం ఫ్యాను ఎప్పుడూ కూడామన ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి. మన బతుకులు బాగుపడాలి అంటే ఫ్యాను మీద రెండు ఓట్లు కచ్చితంగా రెండు ఓట్లు కచ్చితంగా వేయాలి. కచ్చితంగా గుర్తుపెట్టుకోమని సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నానని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.