ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకోకపోతే సాక్షులు, సహకుట్రదారులు, దర్యాప్తు అధికారులను బెదిరించడానికి వీలవుతుందని, హైకోర్టు చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అరెస్ట్ సాధ్యం కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 29న ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అసలేంటీ ఇన్నర్ రింగ్ రోడ్ కేస్?
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. అలైన్మెంట్ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేయించారు.
అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు సమీపంలో భారీగా భూములు కొన్నారు.
అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు.
అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది.
నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో కరకట్ట కట్టడం నిర్మాణం జరిగింది. క్విడ్‌ప్రోకో కిందే కరకట్ట కట్టడాన్ని లింగమనేని చంద్రబాబుకు అప్పగించారు . ఆ ఇంటికి టైటిల్‌దారుగా లింగమనేని రమేశ్ ఉన్నప్పటికీ , ఏడేళ్లుగా సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ చంద్రబాబు అదే నివాసంలో కొనసాగుతున్నారు.