ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడిని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎం పైనే దాడి జరగటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పైన ప్రాథమిక సమాచారం సేకరించి, పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దాడికి కారకులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాజకీయ ప్రమేయంతో పాటుగా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. కేంద్రం సైతం ముఖ్యమంత్రి పై దాడి అంశం పైన ఆరా తీసినట్లు సమాచారం.
సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతున్న సమయంలో వివేకానంద స్కూల్ వద్ద ఈ దాడి జరిగింది. జగన్ కంటి పైన గాయం అయింది. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స చేసారు. ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రిలో జగన్ గాయానికి కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జగన్ పక్కనే బస్సు పైన ఉన్న సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయం అయింది. జగన్ పైన దాడి జరగటం గాయం కావటంతో ప్రధాని మోదీ సహా అమిత్ షా, తమిళనాడు ముఖ్యంమత్రి స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
జీరో వైలెన్స్ ఎన్నికలే టార్గెట్ గా పని చేస్తున్న సమయంలో ముఖ్యంమత్రి పైన దాడి జరగడంతో ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని విజయవాడ నగర పోలీసు కమీషనర్ కాంతి రాణాను ఎన్నికల కమిషన్ సీఈవో మీనా కోరారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు ఎన్నికల సీఈవోకు ప్రాథమిక సమాచారం అందించారు. ఇప్పటికే ఘటన జరిగిన ప్రాంతాన్ని కమీషనర్ కాంతి రాణా పరిశీలించారు. సమీపంలోని వివేకానంద స్కూల్ నుంచి అగంతకుడు ఈ దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సంఘటన స్థలంకు పక్కన ఉన్న స్కూల్ నుంచి దాడి జరిగినట్లుగా భావిస్తున్న అధికారులు అక్కడి సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అనుమానం ఎవరి మీద అయినా ఉంటే పోలీస్ వారికి ఫిర్యాదు చేయాలని పోలీసు కమీషనర్ కాంతి రాణా ప్రజలను కోరారు.