ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తైన రోజు నుంచి ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, ఎవరు ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారు అనే చర్చ ప్రజల్లో తీవ్రంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తెలుగుదేశానికి చెందిన కొంతమంది మాత్రం చంద్రబాబే అధికారంలోకి రాబోతున్నారని ఇదే మాటపై ఎంతైన పందానికి తాము సిద్దమని కాలు దువ్వుతున్నారు. ఇక వైసీపీ క్యాడర్ మాత్రం తమ నాయకుడు అందించిన సంక్షేమ పాలనే తిరిగి తమ పార్టీని అధికారంలో కూర్చోబెడుతుందని ధీమాగా ఉన్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా రేపు జూన్ 4వ తారీకున వెలువడే ఫలితాలు ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయొ తేలిపోతుంది.
కాగా నేడు జరుగుతున్న ప్రచారాన్ని నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం 2009 ఎన్నికల అనంతరం ఫలితాలు రాకముందు ఏవిధమైన చర్చ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య నడిచిందో, ఇప్పుడూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని వారు గుర్తు చేసుకుంటుననారు. 2009 ఎన్నికల తరువాత కూడా వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికలకి వెళ్ళిన కాంగ్రెస్ ఓడిపోతుందని, చంద్రబాబుకే తిరిగి అధికారం రాబోతుందని నగదు బదిలీ పథకం హామీ చంద్రబాబుకి వరంలా మారిందని చంద్రబాబు అనుకూల పత్రికలు, తెలుగుదేశం కార్యకర్తలు ప్రచారం చేస్తే. వైయసార్ గారి సంక్షేమ పాలనే ఆయనకి మళ్ళీ తిరిగి పట్టం కట్టేందుకు ఉపయోగపడుతుందని నమ్ముతూ వచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే అధికారంలోకి రాబోతున్నట్టు చేసుకున్న ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ వెనుకపడితే, నాడు తెలుగుదేశం దూసుకుపోయింది.
తెలుగుదేశం ప్రచారంతో తీవ్ర ఉత్కంఠంగా మారిన 2009 ఎన్నికల ఫలితాల విడుదల, చివరికి తీవ్ర ప్రచారం చేసుకున్న తెలుగుదేశాన్ని ఉసూరు మనిపించాయి. సంక్షేమ పాలన అందుకున్న ప్రజలు తిరిగి వైయస్సార్ గారికే పట్టం కట్టారు. 2024 ఎన్నికలు కూడా ఇంచుమించు ఇదే వాదనపై జరిగాయి. ఫలితాలు సైతం 2009 మాదిరే ఉండబోతున్నాయని ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్న మాట. కూటమి కట్టిన బాబుని 2009లో ఎలాగైతే ప్రజలు నమ్మకుండా సంక్షేమ పాలనకు జై కొట్టారో, ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్న మాట. తెలుగుదేశం గెలుస్తుందని నాడు వారి అనుకూల మీడియా వార్తలు నమ్మి ఎలాగైతే పందాలు పెట్టి టీడీపీ కార్యకర్తలు రోడ్డున పడ్డారో ఇప్పుడూ అదే జరుగుతుందని. ఈ పాపం తెలుగుదేశం అనుకూల ఛానల్స్ దే నని వారు చెబుతున్నారు.