ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. సర్విసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలు, వాటిపై అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ వారి అర్జీల పరిష్కారానికి విధి విధానాలను ఖరారు చేసింది. ఈమేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలిలా ఉన్నాయి..
– ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను సకాలంలో మంజూరు చేయాలి
– క్రమశిక్షణ చర్యలపై అర్జీలను వెంటనే పరిష్కరించాలి
– సిక్ లీవుకు సంబంధించిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మంజూరు చేయాలి
– ఉద్యోగులపై దాడికి పాల్పడ్డవారిపై సత్వరం కఠిన చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలి
– కేఎంపీఎల్, ఈపీకేలపై ఉద్యోగులను కౌన్సెలింగ్కు పంపించడం నిలిపివేయాలి
– తక్కువ రాబడి వచ్చే బస్ షెడ్యూళ్లను రీ షెడ్యూల్ చేయాలి
– బీఎస్ 4, బీఎస్ 6 వాహనాల వీల్బోల్ట్ మెషిన్లు, మయాటిక్ గన్స్, ఎలక్ట్రికల్ పరికరాలను అన్ని గ్యారేజీలలో అందుబాటులో ఉంచాలి
– ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలు, భోజనశాలలు పరిశుభ్రంగా ఉంచాలి
– మూడు, నాలుగు షెడ్యూళ్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి
– వైఫల్యాలను కారణంగా చూపుతూ గ్యారేజ్ ఉద్యోగులను బదిలీ చేయకూడదు
– తగిన శిక్షణ లేకుండా డ్రైవర్లకు టిమ్ డ్యూటీలను అప్పగించకూడదు
– జీతాల కోత విధిస్తూ సెలవులు మంజూరు చేయకూడదు.
కొన్నేళ్లుగా అప్పీళ్లు, రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులతో ఊరట లభించింది. వారి కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది. సర్వీసు నిబంధనలను సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసినవి..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ విలీనం చట్టం వల్ల అప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ.. పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 52 వేల మంది ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన ప్రభుత్వంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అక్టోబర్, 2019 లో ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తరువాత ఈ పదవీ విరమణ వయసును మళ్ళీ 62 ఏళ్ళకు ప్రభుత్వం పెంచింది.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీని తీసుకువచ్చింది.
ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే వారి పిల్లల చదువుల కోసం విద్యా రుణాలు అందిస్తారు. అలాగే ఉద్యోగుల పిల్లల వివాహ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ–2022 ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్తింపజేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం కుదరదని ఖచ్చితంగా చెప్పిన టీడీపీ ప్రభుత్వం 2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించకుండా రూ. 146.04 కోట్లను బకాయిపెట్టింది. నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఆ మొత్తాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది.