వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరితో పూర్తి స్థాయిలో పొత్తులో ఉంటుందో ఇంకా చర్చల దశలోనే ఉంది. జనసేనతో కుదిరినా సీట్ల విషయం ఖరారు లేదు. బీజేపీ విషయం తెగలేదు. ఈ లెక్కన అధికారిక జాబితా ఇంకా తయారు కాలేదు. అయితే రాధాకృష్ణ పత్రిక ఆంధ్రజ్యోతి మాత్రం రోజూ తెలుగుదేశం అభ్యర్థులు వీరేనంటూ జాబితాలను ప్రకటిస్తోంది. ఆయన చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. దీంతో ఇదే ఫైనల్ లిస్ట్ అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు జనసైనికులు భగ్గుమంటున్నారు. తమ నేతలు అడుగుతున్న సీట్లను టీడీపీ నేతలకు ఇవ్వడమే కారణం.
ఒకటి, రెండు జిల్లాల్లోని కొన్ని స్థానాలను తెలుగుదేశం నేతలకు ప్రకటించకుండా.. కసరత్తు జరుగుతోందని జ్యోతి అలాగే వదిలేసింది. అలా అని సేన నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయని రాయడం లేదు. అసలు స్పష్టత లేకపోవడంతో తమ సీట్ల విషయంలో ఆ పత్రిక పెత్తనం ఏంటని పేర్లు లేని నేతలు మండిపడుతున్నారు.
ఆలపాటి రాజాకు ఝలక్
టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజాకు ఆంధ్రజ్యోతి ఝలక్ ఇచ్చింది. ఈయన తెనాలి సీటు అడుగుతున్న విషయం తెలిసిందే. అయితే రాధాకృష్ణ దానిని జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చేశారు. ఈ విషయం చంద్రబాబు, లోకేశ్‌కు తెలిసే జరిగిందని రాజా వర్గం ఆరోపిస్తోంది. ఇన్ని రోజుల నుంచి ఆంధ్రజ్యోతి సీట్లు ప్రకటిస్తున్నా పార్టీ అధిష్టానం ఇది అధికారిక జాబితా కాదని ఖండించలేదు. దీనిని నేతలు చూపిస్తూ ఘొల్లుమంటున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. రాజా కూడా షాక్‌కు గురై భవిష్యత్ గురించి సన్నిహితులతో చర్చిస్తున్నారు.
కొత్త నెల్లూరు జిల్లాలో జ్యోతి ప్రకటించిన సీట్ల విషయంలోనూ నాయకులు భగ్గుమంటున్నారు. నెల్లూరు సిటీని పొంగూరు నారాయణకు, రూరల్‌ను కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇచ్చింది. అయితే ఈ రెండింటిలో ఒక స్థానం కోసం జనసేన పట్టుబడుతోంది. ఇంకా కోవూరు, ఉదయగిరి సీట్లను ఎవరికో చెప్పలేదు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడు దినేష్‌రెడ్డి చాలాకాలంగా తిరుగుతున్నారు. పార్టీ కోసం బాగా ఖర్చు పెట్టారు కూడా. ఆయన జ్యోతి వార్తను చూసి మండిపడి ఇక్కడ నేనే అభ్యర్థి. ఎవరికి సీటు ఇచ్చినా ఒప్పుకోనని తేల్చి చెప్పారు. ఉదయగిరి రేసులో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఉన్నారు. ఈయన టీడీపీ ఆర్థిక స్తంభాల్లో ఒకరని పేరుంది. అలాంటి వ్యక్తికే సీటు ఇవ్వకపోవడంతో ఆయన వర్గం కన్నెర్ర చేస్తోంది. బాబు కేసుల విషయమై తమ నాయకుడు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తే.. సీటు ప్రకటించకుండా పెండింగ్‌లో పెడతారా అని ప్రశ్నిస్తోంది. మొత్తంగా రాధాకృష్ణ ప్రకటిస్తున్న లిస్ట్‌లు చిచ్చు రేపుతున్నాయి. అయితే బాబు డైరెక్షన్లోనే ఇది జరుగుతోందని ప్రచారం ఉంది. పొత్తులో ఉన్న పార్టీలను తక్కువ స్థానాలకు పరిమితం చేసేందుకే ఈ ఎత్తుగడ వేశారని చెబుతున్నారు. రాధాకృష్ణ రక్తం కూడా పసుపుమయం. ఆయన్ను ఏమనలేక చాలామంది నాయకులు తమలో తాము కుమిలిపోతున్నారు.