గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. టీడీపీలో అత్యంత సీనియర్ నేత.. ఆరుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గెలుపు గుర్రం.. కానీ ఇప్పుడు ఆయనకు సీటు కేటాయిస్తారా లేదో చెప్పలేని పరిస్థితి. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన సిట్టింగ్ స్థానాలను మార్చే అవకాశం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏ ముహూర్తాన అన్నారో కానీ ఆయన సిట్టింగ్ గా ఉన్న స్థానానికే ఎసరు వచ్చింది. చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులో ఎన్నికలకు వెళ్లాలని ఎప్పుడైతే నిర్ణయించారో పలువురు సీనియర్ నాయకుల సీట్లను త్యాగం చేసే పరిస్థితి టీడీపీలో దాపురించింది. మైలవరంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాకు టీడీపీ మొండిచెయ్యి చూపిందన్న వార్తలు వస్తుండగా తాజాగా బుచ్చయ్య చౌదరి సీట్ కూడా ప్రశ్నార్థకంగా మారింది.
2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బలంగా వీచిన ఫ్యాన్ గాలిని తట్టుకుని కూడా గెలిచిన అతికొద్దిమంది టీడీపీ నేతల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా చంద్రబాబు సన్నిహితుడిగా పేరుపొందిన ఆయనకు కూడా ఇప్పుడు సీటును కేటాయించలేని పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరికి 74,166 ఓట్లు పోలవగా జనసేన తరపున పోటీకి దిగిన కందుల దుర్గేష్ కి 42,685 ఓట్లు పోలయ్యాయి. టీడీపీతో పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటును జనసేన ఆశిస్తోంది. దాదాపుగా పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ ను రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం.
కాగా ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నుండి పోటీకి దిగేది తానేనని సన్నిహితుల వద్ద బుచ్చయ్య చౌదరి చెప్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నుండి మాత్రం సీటు విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సీనియర్లను పక్కనబెట్టి యువతకు అవకాశం కల్పిస్తామని లోకేష్ పలు సందర్భాల్లో ప్రస్తావించిన నేపథ్యంలో తనకు సీట్ ఉంటుందా ఉండదా అనే మీమాంసలో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అందులోనూ బుచ్చయ్య గతంలో లోకేష్ నాయకత్వాన్ని పలు మార్లు వ్యతిరేకించి ఉండటంతో బుచ్చయ్యని తప్పించే విషయంలో లోకేష్ హస్తం కూడా ఉందని టీడీపీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంది.. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీని వీడతారా లేక పార్టీ కోసం తన టికెట్ ను త్యాగం చేసి త్యాగరాజుగా మిగిలిపోతారా అనే సందేహాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా జనసేనతో పొత్తు ఇప్పుడు టీడీపీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. టీడీపీ తరపున టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేతలకు ఆశావహులందరికీ పొత్తు సమీకరణాల్లో భాగంగా చంద్రబాబు టికెట్ నిరాకరించే పరిస్థితులు ఏర్పడ్డాయి. టికెట్ దక్కని అసంతృప్తులంతా ఎదురుతిరిగితే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశం ఉంది. మరి చంద్రబాబు ఈ గడ్డు పరిస్థితిని ఎలా మేనేజ్ చేస్తారో టికెట్ ఆశించే అభ్యర్థులకు ఎలా సర్దిచెప్తారో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఏది ఏమైనా టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా పేరొందిన బుచ్చయ్య చౌదరికి సీట్ దక్కకపోవడం ఆ పార్టీ ఎంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందో స్పష్టం చేస్తుంది. మరి బుచ్చయ్య తిరుగుబాటు చేస్తారా లేక సీటు త్యాగం చేస్తారా అనేది కొన్ని రోజులు వేచి చూస్తే తెలిసిపోతుంది.