తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్), సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ. ఆయనేమో బడా పారిశ్రామికవేత్త. దానవంతుడిగా పైకి కనిపిస్తాడు. ఈయనేమో కాలేజీలు, స్కూళ్ల అధినేత. పైకి గొప్ప విద్యావేత్తలా కనిపిస్తాడు. రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనకు వేల కోట్ల రూపాయల ఆస్తుల్లేవని, కష్టపడి పైకి వచ్చానని, విలువలున్న వ్యక్తినని చెప్పుకొంటుంటాడు. మైకు దొరికితే ముగ్గురూ గంటలు గంటలు నీతులు చెబుతారు. కానీ చేసే పనులు అందుకు పూర్తిగా విరుద్ధం. ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల్ని సంతలో పశువుల్లా కొనేసి తాము బలవంతులమని చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉంది. దీంతో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, డివిజన్ల ఇన్చార్జిలు, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలను టీడీపీ చేర్చుకునేందుకు వీరు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇందుకోసం డబ్బులిచ్చారు. భయపెట్టారు. అదే రీతిలో ఇప్పుడూ ఆ ముగ్గురూ నెల్లూరులో వ్యవహరిస్తున్నారు. కార్పొరేటర్ చేరితే రూ.కోటి, డివిజన్ ఇన్చార్జి అయితే రూ.25 లక్షలు, సర్పంచ్‌కు రూ.10 లక్షలు, ఎంపీటీసీకి రూ.15 లక్షల చొప్పున ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. ముఖ్య నాయకులైతే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెబుతున్నారు.
సిటీ పరిధిలో వేమిరెడ్డి, నారాయణ చెరి సగం పెట్టుకుంటున్నారు. రూరల్ లిమిట్స్‌లో ఖర్చంతా ఒక్క వేమిరెడ్డిదే. శ్రీధర్‌రెడ్డి పని డీల్ చేయడం. సిటీలో రూప్‌కుమార్ యాదవ్ అధికార పార్టీ వారితో మాట్లాడుతున్నట్లు తెలిసింది. టీడీపీ ప్రభుత్వం వస్తే కేసులతో ఇబ్బంది పెడతామని, చెప్పినట్లు విని డబ్బు తీసుకుని చేరితే ఏ సమస్య ఉండదని హెచ్చరిస్తున్నారట. తాజాగా 9వ డివిజన్ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్‌కు రూ.కోటి ఇచ్చి చంద్రబాబు చేత కండువా కప్పించారు. వీపీఆర్ రూ.50 లక్షలు, నారాయణ రూ.50 లక్షలు ఇచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కాగా ఈ చేరికను వ్యతిరేకించిన సీనియర్ నాయకుడికి రూ.25 లక్షలు ఇచ్చి సైలెంట్ చేసినట్లు సమాచారం.
గెలుపు కోసం ప్రతి అడ్డదారిని టీడీపీ నేతలు తొక్కుతున్నారు. వేమిరెడ్డి, నారాయణకు ప్రజా బలం లేదు. ఉందల్లా డబ్బు మాత్రమే. దీంతో రెచ్చిపోతున్నారు. పైకి ప్రజాస్వామ్యవాదులమని చెబుతూనే.. ఇతర పార్టీల నేతలను రూ.కోట్లతో ప్రలోభ పెట్టి చేర్చుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. వీరి చేష్టలకు ప్రజలు గుణపాఠం రోజు దగ్గర్లోనే ఉంది.
– వీకే..